దురంధర్.. గాలి తీసేస్తున్న బాక్సాఫీస్
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ధాటికి బాలీవుడ్ అస్సలు తట్టుకోలేకపోతోంది. ‘బాముబలి’ ప్రభంజనం తర్వాత మరెన్నో సౌత్ సినిమాలు నార్త్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.
By: Tupaki Desk | 3 Dec 2025 3:00 AM ISTగత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ధాటికి బాలీవుడ్ అస్సలు తట్టుకోలేకపోతోంది. ‘బాముబలి’ ప్రభంజనం తర్వాత మరెన్నో సౌత్ సినిమాలు నార్త్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. కేజీఎఫ్, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్, ‘పుష్ప’, ‘పుష్ప-2’, కాంతార, కాంతార-2, మహావతార నరసింహ.. ఇలా ఎన్నో సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే సమయంలో బాలీవుడ్ టాప్ స్టార్లు నటించిన అనేక చిత్రాలు దారుణమైన ఫలితాలందుకున్నాయి. అక్కడి స్టార్లకు ఓపెనింగ్ రావడం కూడా కష్టమవుతోంది.
బాలీవుడ్లో భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘యానిమల్’, ‘జవాన్’ సౌత్ డైరెక్టర్లు తీసిన సినిమాలు కావడం గమనార్హం. ఇలాంటి టైంలో ‘దురంధర్’ అనే సినిమా మీద బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ‘యురి’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా.. ఇలా పేరున్న తారాగణమే ఉంది ఇందులో.
‘దురంధర్’ను రణ్వీర్ సింగ్‌కు ‘యానిమల్’ లాంటి సినిమా అంటూ బాలీవుడ్ తెగ హైప్ ఇచ్చుకుంది. దీని ట్రైలర్ ‘యానిమల్’ సినిమా ప్రోమోలను గుర్తు చేసింది. ‘యానిమల్’ను అనుకరిస్తూ ఈ చిత్రానికి మూడున్నర గంటలకు పైగా రన్ టైం కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని.. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా ఈ మూవీ నిలవబోతోందని ట్రేడ్ పండిట్లతో సోషల్ మీడియా పోస్టులు వేయించుకున్నారు. తీరా రిలీజ్ టైం దగ్గరికొచ్చేసరికి ‘దురంధర్’ తుస్సుమనిపిస్తోంది.
దీనికి రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. స్పందన అంతంతమాత్రంగా ఉంది. ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు చాల ా తక్కువగా కనిపిస్తున్నాయి. సినిమా కోసం జనం ఎగబడే పరిస్థితి కనిపించడం లేదు. ‘యానిమల్’ రిలీజైనపుడు టికెట్ల కోసం డిమాండ్ మామూలుగా లేదు. అదనపు షోలు యాడ్ చేస్తూ వెళ్లారు. మిడ్ నైట్ షోలు కూడా వేశారు. ఆ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ ‘దురంధర్’ మీద ఇంతకుముందున్న 40-50 కోట్ల ఓపెనింగ్ అంచనాలను ఎంతమాత్రం అందుకునే పరిస్థితి కనిపించడం లేదు. తొలి రోజు రూ.20 కోట్లు వస్తే గొప్ప అన్నట్లుంది పరిస్థితి. సినిమాకు టాక్ పాజిటివ్‌గా రాకపోతే.. రూ.350 కోట్ల బడ్జెట్ పెట్టిన ఆదిత్య ధర్ అండ్ కో నిలువునా మునిగిపోవడం ఖాయం.
