బాక్సాఫీస్ లెక్కలు మార్చిన 'గురువారం'.. రామ్ నమ్మకం గెలిచింది!
సాధారణంగా పెద్ద సినిమాలకు శుక్రవారం సెంటిమెంట్ ఉంటుంది. కానీ కంటెంట్ మీద నమ్మకం ఉంటే ఏ వారం వచ్చినా బాక్సాఫీస్ బద్దలవుతుందని 'ఆంధ్ర కింగ్ తాలూకా' నిరూపించింది.
By: Tupaki Desk | 28 Nov 2025 10:55 AM ISTసాధారణంగా పెద్ద సినిమాలకు శుక్రవారం సెంటిమెంట్ ఉంటుంది. కానీ కంటెంట్ మీద నమ్మకం ఉంటే ఏ వారం వచ్చినా బాక్సాఫీస్ బద్దలవుతుందని 'ఆంధ్ర కింగ్ తాలూకా' నిరూపించింది. రామ్ పోతినేని కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ చిత్రం, విడుదలకు ముందే క్రియేట్ చేసిన బజ్ ను నిలబెట్టుకుంది. వీక్ డే గురువారం రిలీజ్ అనే చిన్నపాటి రిస్క్ ను కూడా దాటుకుని, ఇప్పుడు బాక్సాఫీస్ రేసులో దూసుకెళ్తోంది. తొలి ఆట నుంచే వినిపిస్తున్న పాజిటివ్ టాక్ సినిమా రేంజ్ ను పెంచేసింది.
మాస్ సినిమాలతో విసిగిపోయిన ఆడియన్స్ కు, ఈ సినిమా ఒక ఫ్రెష్ బ్రీజ్ లా అనిపించింది. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, సామాన్య ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. బుక్ మై షోలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవ్వడం, ఈవినింగ్ షోలకు హౌస్ ఫుల్ బోర్డులు పడటం చూస్తుంటే.. ఈ సినిమా లాంగ్ రన్ లో గట్టిగానే నిలబడేలా ఉంది. మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడం ఈ సినిమాకు ప్రధాన ఆయుధంగా మారింది.
అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన అంశం ఓవర్సీస్ వసూళ్లు. ఈ మధ్య కాలంలో అక్కడ మార్కెట్ లిమిటెడ్ గా కనిపించింది. కానీ రామ్ ఈసారి ఆ గీతను చెరిపేశాడు. నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్స్ ద్వారానే 250 వేల డాలర్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది రామ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్. గతంలో 'స్కంద'కు వచ్చిన ఓపెనింగ్స్ కంటే ఇది చాలా ఎక్కువ. క్లాస్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో రామ్ సక్సెస్ అయ్యాడని ఈ నంబర్స్ చెబుతున్నాయి.
ఈ విజయానికి మూలస్తంభం మాత్రం రామ్ నటన అనే చెప్పాలి. ఇన్నాళ్లు చూసిన రామ్ వేరు, ఈ సినిమాలో కనిపిస్తున్న 'సాగర్' వేరు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, అభిమానుల గుండెల్లోతుల్లోకి చొచ్చుకుపోయేలా నటించాడు. రామ్ కెరీర్ లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు. స్టార్ డమ్ పక్కన పెట్టి, కథను నమ్మి చేసిన ఈ ప్రయోగం ఆయనకు మంచి ఫలితాన్ని ఇచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ జడ్జిమెంట్ మరోసారి నిజమైంది. రొటీన్ కమర్షియల్ హంగులు కాకుండా, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథతో కూడా కమర్షియల్ హిట్టు కొట్టొచ్చని నిరూపించారు. కథలోని ఎమోషన్, రామ్ నటన, నిర్మాణ విలువలు అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. అందుకే వీకెండ్ రాకముందే సినిమాకు హిట్ కళ వచ్చేసింది. శుక్రవారం బుకింగ్స్ చూస్తుంటే ఈ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. రామ్ కోరుకున్న భారీ బ్రేక్ ఈ సినిమాతో వచ్చేసినట్లే అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గురువారం నాడు మొదలైన ఈ జాతర, వీకెండ్ పూర్తయ్యేసరికి భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం పుష్కలంగా ఉంది. చూడాలి మరి బాక్సాఫీస్ లెక్కలు ఎంతవరకు వెళతాయో.
