సాగర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆ కుటుంబం తృటిలో పెను విషాదం నుంచి తప్పించుకుంది. టర్కీలోని కుకుక్కుయూ నగరంలో సరదాగా బీచ్ లో గడిపేందుకు వెళ్లిన ఆ దంపతులు తమ పది నెలల చిన్నారి మెల్దా ఇగ్లిన్ నూ తీసుకెళ్లారు. ఆడుకునే ట్యూబులో పాపను కూర్చోబెట్టి వారు మాటల్లో మునిగిపోయారు. ఇంతలో అలవచ్చి పాపను సముద్రంలోకి లాక్కెళ్లిపోయింది. ఇంకేముంది కాసేపటికి పాప కనిపించడం లేదంటూ వారు వెతుకులాట ప్రారంభించారు. దూరాన సముద్రంలో తేలుతున్న ట్యూబ్ కనిపించింది. అందులోనే పాపను కూర్చోబెట్టడంతో కాపాడేందుకు వెళ్లాలనుకున్నారు. కానీ.. సముద్రంలో సాహసం చేయడం ఎవరి తరమూ కాదు కదా. వెనక్కు తగ్గారు. అక్కడున్న జనం కూడా చేరినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో పాపం ఆ జంట దిక్కుతోచని స్తితిలో ఏడుస్తూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది.
సుమారు కిలోమీటరు దూరంలో సముద్రంలో తేలుతూ వెళ్లిపోయిన పాపను కోస్టు గార్డు బృందాలు చూశాయి. బట్లలో వెళ్తున్నవారికి సముద్రంలో ఏదో తేలుతూ కనిపించగా దగ్గరికి వెళ్లి చూసేసరికి అందులో పాపం ఉండడంతో వారు నిర్ఘాంతపోయారు. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాపను రక్షించి ఒడ్డుకు చేరారు. మృత్యువు అంచుల వరకూ వెళ్లచ్చిన పాపను పట్టుకుని ఆ తల్లిదండ్రులు ముద్దుల్లో ముంచెత్తారు. అయితే.... ఆ తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై పాపం స్థానికులు వారకి చీవాట్లు పెట్టారు. ఏదైతేనేం పాప మాత్రం మృత్యుంజయురాలిగా టాక్ ఆఫ్ ద టర్కీ అయిపోయింది.