Begin typing your search above and press return to search.

"మెర్సిడెస్‌ బెంజ్‌"పై మహిళల మోజు... హైదరాబాద్ లో ఎంతమందో తెలుసా?

లగ్జరీ కార్లపై ఉండే మోజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటిలో మెర్సిడెస్ బెంజ్ కూడా టాప్ ప్లేస్ లో ఉంటుందని అంటారు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 9:02 AM GMT
మెర్సిడెస్‌ బెంజ్‌పై మహిళల మోజు... హైదరాబాద్ లో ఎంతమందో తెలుసా?
X

లగ్జరీ కార్లపై ఉండే మోజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటిలో మెర్సిడెస్ బెంజ్ కూడా టాప్ ప్లేస్ లో ఉంటుందని అంటారు. అయితే మెర్సిడేస్ బెంజ్ పై ఆసక్తి చూపేవారిలో హైదరాబాద్ మహిళలు కూడా అధికంగా ఉన్నారని అంటున్నారు. తాజాగా ఈ విషయాలను మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ కీలక విషయాలు వెల్లడించారు.

వచ్చే ఏడాది- ఏడాదిన్నరలో 3 - 4 విద్యుత్తు కార్లు (ఈవీ) తీసుకువస్తామని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ వెల్లడించారు. మూడేళ్లలో తాము విక్రయించే కార్లలో నాలుగో వంతు విద్యుత్తు కార్లే ఉంటాయని అన్నారు. ఎలక్ట్రిక్‌ కార్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో విక్రయాలను పెంచుకోవాలని మెర్సిడెస్‌ బెంజ్‌ భావిస్తోందని తెలిపారు.

కొత్త జీఎల్‌సీ కార్లను హైదరాబాద్‌ మార్కెట్‌ లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వీటిలో జీఎల్‌సీ 300 ఎక్స్ షోరూం ధర రూ.73.5 లక్షలు కాగా, జీఎల్‌సీ 220డి ధర రూ.74.5 లక్షలు గా ఉందని తెలిపారు. పెట్రోలు, డీజిల్‌ ఇంజన్లతో ఈ కార్లలో రెండో తరం ఇంటిగ్రేటెడ్‌ స్టార్టర్‌ జనరేటర్‌ సిస్టమ్‌, ఎంబీయూఎక్స్‌ ఇన్ఫోటెయిన్మెంట్‌ సిస్టమ్‌ వంటి ప్రత్యేకతలున్నాయి.

దేశవ్యాప్తంగా వీటికి 1500 బుకింగ్‌ లు రాగా, ఇందులో 8% హైదరాబాద్‌ నుంచి జరిగాయి. ఈ సందర్భంగా స్పందించిన సంతోష్‌... హైదరాబాద్‌ తమకు ముఖ్యమైన మార్కెట్‌ అని, ఇక్కడ మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లు కొనుగోలు చేసే వారిలో 30% మంది మహిళలు ఉండటం ప్రత్యేకత అని తెలిపారు.

ఇదే సమయంలో 2022 అమ్మకాలతో పోలిస్తే.. 2023లో రెండంకెల వృద్ధి సాధించగలమని అంచనా వేసిన ఆయన... తమ పుణె ప్లాంటులో ప్రస్తుతం ఏటా 20,000 కార్లు ఉత్పత్తి చేస్తుండగా, ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నామని అన్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలలకు 8,500 మెర్సిడెస్ కార్లను విక్రయించినట్లు చెప్పారు.

కాగా, ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలపై రోడ్డు పన్ను విధిస్తున్నారు. అయితే త్వరలో ఈ రాష్ట్రాలు కూడా త్వరలో దీన్ని ఎత్తివేయవచ్చని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.