Begin typing your search above and press return to search.

కారు.. టూ వీలర్ కొనేవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్

ఎన్నాళ్లని బైక్ పై తిరుగుతాం..? ఫ్యామిలీతో వెళ్లడం మరీ కష్టమైపోతోంది

By:  Tupaki Desk   |   15 July 2023 8:38 AM GMT
కారు.. టూ వీలర్ కొనేవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్
X

ఎన్నాళ్లని బైక్ పై తిరుగుతాం..? ఫ్యామిలీతో వెళ్లడం మరీ కష్టమైపోతోంది.. కనీసం చిన్న కారైనా కొనుక్కోవాలి.. కానీ, డబ్బులెలా..? కనీసం ఐదారు లక్షలైనా కావాలి కదా..? అబ్బా 100 సీసీ బైక్ వద్దు.. 150 సీసీ బైక్ అయితే.. కాస్త బాగుంటుంది.. కానీ, రూ.లక్షన్నరకు తక్కువ లేదు కదా..? ఇలాంటి ఆలోచనలన్నీ మీ మదిలో సుడులు తిరుగుతున్నాయా..? అప్పోసొప్పో చేసి కొనేద్దాం అనుకుంటున్నారా? అయితే, కాస్త ఆగండి.. అప్పుచేసి వడ్డీలు కట్టి నష్టపోవద్దు.. నింపాదిగా తక్కువ వడ్డీతో ఎటువంటి అదనపు రుసుములు చెప్పకుండా వేసే చార్జీలు లేకుండా రుణం పొంది వాహనం కొనుక్కుందురుగాని..

మీరు వినేది నిజమే.. కొత్తగా బైక్ స్కూటర్ కారు కొనాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇలాంటివారి కోసమే స్కీం తీసుకొస్తోంది. తద్వారా ప్రజలకు ఊరట కల్పించే యోచనలో ఉంది. ఈ మేరకు ఫేమ్ 3 స్కీమ్ పై మోదీ ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది అమల్లోకి వస్తే కోట్లాదిమంది వాహనదారులకు గొప్ప ఊరటే. ప్రస్తుతం ఫేమ్ 2 అందుబాటులో ఉంది. 2024 మార్చి 31 అంటే ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.

పాతదాని స్థానంలో కొత్త స్కీం..

ఫేమ్ 2 కాల పరిమితి ఈ ఆర్థిక సంవత్సరం చివరితో ముగియనుంది. దీంతోనే కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 3 ఆలోచన చేస్తోంది. అయితే, ఇందులో హైబ్రిడ్ వాహనాల (పెట్రో-ఎలక్ట్రిక్)కు

అధిక ప్రాధాన్యం లభించే వీలుంది. ఎందుకంటే రాబోయే కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. వాస్తవానికి ఫేమ్ 2 కింద విద్యుత్తు వాహనాల కొనుగోలుకు సబ్సిడీ లభిస్తోంది. ఎలక్ట్రిక్ కారు, స్కూటర్ , బైక్ , ట్రక్ వంటి వాటి కొనుగోలుపై తగ్గింపు దక్కుతోంది. అయితే, ఫేమ్ 1 పథకంలో కూడా ఈ ప్రయోజనం అందుబాటులో ఉండేది. కొత్త పథకంలో మాత్రం కాలానికి తగినట్లుగా వస్తున్న మార్పులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. వీటి కొనుగోలుపై సబ్సిడీ పొందొచ్చు. ప్రస్తుతం ఈ సౌకర్యం అందుబాటులో లేదు. కొత్త పథకం ద్వారా హైబ్రిడ్ వాహనాల అమ్మకాలను పెంచే ఉద్దేశం కూడా ఇందులో ఉంది. హైడ్రోజన్ పవర్డ్ వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ వంటి వాటికి ఫేమ్ 3లో సబ్సిడీ ఎక్కువగా ఉండొచ్చనేది అంచనా.

విద్యుత్తు కార్లకే ఎక్కువ రాయితీ..

గతంలో ఉన్న రెండు దశల పథకాల్లో విద్యుత్తు ద్విచక్ర వాహనాలకు అధిక ప్రాధాన్యం లభించింది. ప్రారంభంలో 40 శాతం వరకు సబ్సిడీ వచ్చింది. ఫేమ్ 2లో మాత్రం సబ్సిడీని 15 శాతానికి తగ్గించారు. ఫేమ్ 1, 2లో విద్యత్తు ఫోర్ వీలర్లకు ఎక్కువ ప్రోత్సాహం లభించ లేదు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం వీటికి అధిక ప్రోత్సాహం అందించే వీలుందని నివేదికలు పేర్కొంటున్నాయి. కొత్త పథకం వస్తే.. కారు కొనేవారికి అధిక ప్రయోజనం కలుగుతుందని చెప్పొచ్చు. ద్విచక్ర వాహనాలకు కూడా రాయితీ లభించొచ్చు. అయితే గతంలో కన్నా తక్కువ ప్రయోజనం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ విద్యత్తు వాహనం కొనే ఆలోచనలో ఉంటే ఫేమ్ 2 ఉన్నప్పుడే కొనుగోలు చేయడం ఉత్తమం.