Begin typing your search above and press return to search.

కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?

వచ్చేనెల 1 నుంచి భారత్ లో బీఎండబ్ల్యూ, మిని బ్రాండ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

By:  Tupaki Desk   |   9 Jun 2026 10:00 PM IST
కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?
X

అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రభావం అన్నిరంగాలపైనా చూపుతోంది. ప్రధానంగా డాలర్ విలువ పెరిగిపోవడంతో విదేశీ ఉత్పత్తుల ధరలు షాక్ కొడుతున్నాయి. ఇప్పటికే అనేక రకాల వస్తువుల ధరలు పెరిగిపోగా, తాజాగా లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కూడా షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చేనెల 1 నుంచి భారత్ లో బీఎండబ్ల్యూ, మిని బ్రాండ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గత రెండు, మూడు నెలలుగా ఆటోమొబైల్ రంగంలో పలు కంపెనీలు ధరల పెంపును ప్రకటించగా, ఇప్పుడు ఆ జాబితాలోకి బీఎండబ్ల్యూ కూడా చేరిందని అంటున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం, దానికి తోడు రవాణా ఖర్చులు కూడా పెరగడంతో తాము కూడా కారుల ధర పెంచాల్సివస్తోందని కంపెనీ వెల్లడించింది. పెరిగిన ఇన్‌పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని సంస్థ పేర్కొంది. తాజా నిర్ణయం ప్రకారం బీఎండబ్ల్యూ, మినికి చెందిన అన్ని మోడళ్ల కార్ల ధరలు 2 శాతం మేర పెరగనున్నాయని చెబుతున్నారు. ‘మార్కెట్లో తమ ఉత్పత్తులకు ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా లగ్జరీ మొబిలిటీ విభాగంలో బీఎమ్‌డబ్ల్యూ సరికొత్త మైలురాళ్లను సృష్టిస్తోందని, ప్రస్తుత స్థూల ఆర్థిక సవాళ్ల నడుమ మా ప్రీమియం ప్రమాణాలను, క్వాలిటీని అలాగే కొనసాగించేందుకు పోర్ట్‌ఫోలియో ధరలను 2 శాతం పెంచుతున్నామని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు.

ఏయే మోడళ్ల ధర పెరుగుతుందంటే..

దేశంలో తయారయ్యే లోకల్ మోడళ్లతో పాటు, విదేశాల నుంచి పూర్తిగా దిగుమతి చేసుకునే లగ్జరీ మోడళ్లపై కూడా ఈ ధరల పెంపు వర్తించనుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లోనే తయారయ్యే బీఎండబ్ల్యూ 2 సిరీస్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్ బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్ బేస్, 7 సిరీస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎమ్340ఐ, ఐఎక్స్1 లాంగ్ వీల్ బేస్ ధరలు పెరుగుతాయని అంటున్నారు. అదేవిధంగా పూర్తిగా దిగుమతి చేసుకునే బీఎండబ్ల్యూ ఐ5 ఎమ్60, ఐ7, ఐ7 ఎమ్70, ఐఎక్స్, ఎమ్440ఐ కన్వర్టిబుల్, ఎమ్2 కూపే, ఎమ్4 కాంపిటీషన్, ఎమ్5, ఎక్స్ఎమ్ కారు మోడళ్లు ధర రెండు శాతం పెరగనుందని చెబుతున్నారు.

నిపుణుల సూచన

ధరలు పెరగడానికి ముందే లగ్జరీ కారును తమ ఇంటికి తెచ్చుకోవాలనుకునే వారు ఈ జూన్ నెలలోనే కొనుగోలు చేయడం ఉత్తమమని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల 2 శాతం అదనపు భారాన్ని తప్పించుకోవడమే కాకుండా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.