వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?
వైసీపీలో సంస్థాగత బలంపై అంతర్గత విమర్శలు పెరుగుతున్నాయి. పార్టీ 14 లక్షల మందికి డిజిటల్ ఐడీ కార్డులు, పదవులు ఇచ్చినా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కనిపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. 111 మందికి పైగా నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు బాధ్యతలు విస్మరించారని, స్థానిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి వారి నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 19 Nov 2026 7:07 PM ISTవైసీపీలో సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉందా అంటే జవాబు వినిపించడం లేదు. అధినాయకత్వం తాడేపల్లి నుంచి ఇచ్చిన మౌఖిక ఆదేశాలని కాగితాల రూపంలో జవాబులు ఇస్తూ ఏకంగా పార్టీ కొంప ముంచుతున్న ఇంచార్జిలు చాలా మంది ఉన్నారని అంటున్నారు. దాంతో ఇది కమిటీలు అన్నీ కాగితాల మీదనే ఉండిపోయాయని గ్రౌండ్ లెవెల్ లో అయితే పార్టీ పదవులు అందుకున్న వారు ఎందరు అన్న కొత్త చర్చ సాగుతోంది. అధినాయకత్వం అయితే ఐడీ కార్డులను లక్షల్లోనే ఇంచార్జిలకు నియోజకవర్గ స్థాయిలో పంపించింది అని అంటున్నారు. అలా పంపించిన 14 లక్షల ఐడీ కార్డులు పేరుకే ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఇదంతా కొంత మంది ‘యాక్టింగ్’ ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలంగా కూడా చెబుతున్నారు.
అతి పెద్ద చర్చగా :
ఏపీలో బలమైన ప్రతిపక్షంగా ఉంది అనుకున్న వైసీపీలో అంతర్గత వ్యవహారాలు, క్షేత్రస్థాయి పనితీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. దానికి కారణం ఇటీవల జరిగిన పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల పోరులో వైసీపీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో క్షేత్ర స్థాయిలో అసలు పార్టీలో ఏం జరుగుతోందన్న దానిపై హైకమాండ్ ఆరా తీస్తే సొంత శ్రేణులే నిప్పులు చెరుగుతున్న పరిస్థితి ఎదురైంది అని అంటున్నారు. ఒకవైపు 14 లక్షల మందికి క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ఐడీ కార్డులతో పాటు పార్టీ పదవులు కట్టబెట్టామని పార్టీ అధి నాయకత్వం గొప్పలు చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ సైన్యం ఎక్కడా కనిపించకపోవడతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారిందని అంటున్నారు.
ఐడీ కార్డుల పేరుతో జరిగిందేంటి :
మరి అధినాయకత్వం ఇచ్చిన ఐడ్ కార్డులతో ఏమి జరిగింది అన్నది చూస్తే కనుక విస్తుబోయే నిజాలు చాలా చోట్ల నుంచి వస్తున్నాయని అంటున్నారు. వాస్తవానికి వైసీపీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అలాగే అనుబంధ కమిటీలుగా యూత్, స్టూడెంట్, రైతు, అంగన్వాడీ విభాగాల పేరుతో 14 లక్షల మందికి పదవులు కట్టబెట్టాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. అందుకే వీరందరికీ అధినాయకత్వంఐడీ కార్డులు పంపిణీ చేసింది. ఇంత పెద్ద ఎత్తున నియామకాల ప్రక్రియ జరిగితే అది గ్రౌండ్ లెవెల్ లో ఎక్కడా కనిపించడం లేదు, అంతా కేవలం కాగితాలపైనే మిగిలిపోయిందన్న విమర్శలు వైసీపీలో అంతర్గతంగా బలంగా వినిపిస్తున్నాయని అంటున్నారు.
ఎవరికి పదవులు ఇచ్చారు :
మరి వైసీపీ అయితే ఏపీలో అతి పెద్ద సైన్యాన్ని నిర్మించామని చెప్పుకుంటోంది. కానీ అధినాయకత్వం తాడేపల్లి గడప దాటలేదు, దాంతో ఇది అవకాశంగా తీసుకుని అనేక చోట్ల వైసీపీ ఇంచార్జిలు చేసింది ఏమిటి అంటే బీమా కోసం, బిల్డప్ కోసం పదవులు తమ వారికి పంచి పెట్టేశారు అని అంటున్నారు. వైసీపీ కోసం జెండా మోసే కార్యకర్తలను పక్కన పెట్టి మరీ కేవలం పార్టీ అందించే బీమా సదుపాయం కోసమో లేదా సోషల్ మీడియాలో హోదా ప్రదర్శించుకోవడానికో ఆశపడే అనుయాయులకు ఇన్ఛార్జ్లు పదవులు కట్టబెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విధంగా పార్టీ పదవులు పొందిన వారిలో మెజారిటీ నేతలు గ్రామాలలో తిరిగి ప్రజా సమస్యలపై పోరాడటం అనేదే మానేశారు. ఇక వీరంతా అధినేత జగన్ తో దిగిన ఫోటోలను తమ డిజిటల్ ఐడీ కార్డులను వాట్సాప్ స్టేటస్‌లుగా ఫేస్బుక్ పోస్టులుగా పెట్టుకుని టైం పాస్ చేస్తున్నారు అన్న ఘాటు నిజాలు బయటపడుతున్నాయి. అందుకే వైసీపీ ఎక్కడా పోలింగ్ బూత్ లలో కనిపించలేదని అంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ 14 లక్షల మందిలో కనీసం పది శాతం మంది కూడా పోలింగ్ బూత్‌ల వద్ద కనిపించకపోవడంతోనే పార్టీ సంస్థాగత డొల్లతనం ఒక్కసారిగా బయటకొచ్చింది అని అంటున్నారు.
వందకు పైగా ఇంచార్జిలు :
ఇక ఏపీలో వైసీపీని ముందుకు తీసుకుని పోవాల్సిన బాధ్యత కలిగిన ఇంచార్జిలు అధినేత కళ్ళకు గంతలు కట్టారని అంటున్నారు. ఈ నంబర్ చూస్తే 111 మందికి పైగా నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఉన్నారన్న వార్తలు చూస్తూంటే వైసీపీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందో అర్ధం అవుతోంది అని అంటునారు. ఇక ఈ ఇంచార్జిలు అయితే స్థానిక ఎన్నికలను తీవ్రంగా విస్మరించారని అంతే కాకుండా తమ బాధ్యతను పూర్తిగా విస్మరించి స్థానిక కార్యకర్తల పైనే భారం వేశారని వైసీపీ అంతర్గత నివేదికలలో సైతం స్పష్టమైంది.
తాడేపల్లిలో అలా :
ఇక వైసీపీ హైకమాండ్ సమీక్షా సమావేశాలు పెట్టినపుడు తాడేపల్లికి వెళ్ళే కొంత మంది వైసీపీ ఇంచార్జిలు అక్కడ భారీ ఫైళ్ళతో ఒక రకమైన షోతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. లక్షల సైన్యం అంతా వైసీపీ వెంట ఉందని చెబుతూ ఆల్ ఈజ్ వెల్ అన్న ఫీలింగ్ పెద్దలకు కలిగించి వస్తున్నారు అని అంటున్నారు. తీరా అలాంటి వారు అంతా తమ నియోజకవర్గాలలో అడుగు పెట్టగానే కనీసం పార్టీ ఆఫీసులకు సైతం వెళ్ళకుండా తమ సొంత వ్యవహారాలలో బిజీ అవుతున్నారు అని అంటున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ ని గాలికి పూర్తిగా వదిలేశారు అని అంటున్నారు. నామినేషన్ల దశ నుంచి పోలింగ్ దాకా అధికార కూటమి నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్ళు వస్తున్నా కూడా పోటీలో ఉన్న తమ వారికి కనీసంగా సహకారం కానీ అండగా నిలబడడం కానీ చేయలేకపోయారు అని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నారు.
ఇంచార్జిలు చేతులెత్తేశారు :
ఒక విధంగా చెప్పాలంటే అత్యధిక నియోజకవర్గాలలో ఇంచార్జిలు చేతులెత్తేశారు అని అని క్యాడర్ నుంచి గట్టిగా వస్తున్న ఆరోపణగా ఉంది. కొందరు నేతలు అయితే వైసీపీకి చావో రేవో అన్నట్లుగా గ్రౌండ్ లో క్యాడర్ పోరాడుతూంటే ఫోన్లు స్విచాఫ్ చేసి కూర్చున్నారు అని కూడా ఫిర్యాదులు అధినాయకత్వానికి వెళ్ళాయ్. ఇంకో వైపు చూస్తే అధికార కూటమి అక్రమాలు పోలీసుల నిర్బంధం వంటి వాటి వల్లనే అభ్యర్ధులు పోటీ చేయలేకపోయారు అని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. కానీ అన్ని చోట్లా అలా లేదు, కోస్తా జిల్లాలలో బాగానే పరిస్థితులు ఉన్నా ఇంచార్జిల ఉదాశీనత నిర్లక్ష్యం వల్లనే వైసీపీ ఓటమి పాలు అయింది అని అంటున్నారు.
జగన్ పాదయాత్ర చేస్తే :
అన్ని సమస్యలకు ఒక్కటే జవాబు అన్నట్లుగా జగన్ పాదయాత్ర చేస్తే సరిపోతుందా అన్నది ఇపుడు వైసీపీలో వినిపిస్తున్న మాట. ముందు పార్టీ సంస్థాగతంగా బలం పుంజుకోవాలని అంటున్నారు. అంతే కాదు బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గం ఇంచార్జి దాకా అందరూ కలసి నడిస్తేనే తప్ప గెలుపు దక్కదని కూడా విశ్లేషణలు ఉన్నాయి. అందువల్ల ముందుగా వైసీపీ హైకమాండ్ చేయాల్సింది పనిచేయని ఇంచార్జిలని మొహమాటం లేకుండా తప్పించడం అని అంటున్నారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 88 కి దగ్గరలో 80 సీట్లు వచ్చినా వైసీపీ మరోసారి పవర్ కి దూరం కావాల్సిందే అంటున్నారు. అంతే కాదు ఓడిన ప్రాంతీయ పార్టీలను కేంద్రంలో ఏ జాతీయ పార్టీ ఉన్నా కూడా సులువుగా బలహీనం చేయడం కూడా సహజంగానే జరిగే వ్యవహారమే అని అంటున్నారు.
