దేశంలో రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలను అధికార, విపక్ష పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీ, బీజేపీయేతర పార్టీల మధ్య స్పష్టమైన విభజన వచ్చేసింది. ఎవరికి వారు ఎవరి వ్యూహాలు వారు రచించుకునే పనిలో ఉన్నారు. ఈ సమయంలో ఈ రెండు వర్గాలకూ చెందని వారు కీలకంగా మారబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... అధికార పక్ష కూటమి ఎన్డీఏ 38 పార్టీలతో, విపక్ష కూటమి 'ఇండియా' 26 పార్టీలతో పోటీకి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలో 38 పార్టీలూ హస్తినలో భేటీ అవ్వగా... కాంగ్రెస్ నేతృత్వంలో 26 పార్టీలూ బెంగళూరులో భేటీ అయ్యాయి. ఈ సమయంలో దేశంలో మరో 11 పార్టీలు రెండు వైపులకూ వెళ్లకుండా... సైలంటుగా ఉన్నాయి.
వాటిలో ఏపీనుంచి వైసీపీ, తెలంగాణ నుంచి బీఆరెస్స్, ఒడిశా నుంచి బిజూ జనతాదళ్ తోపాటు బీఎస్పీ, మజ్లిస్, టీడీపీ, శిరోమణి అకాలీదళ్, ఏఐయూడీఎఫ్, జనతాదళ్ (ఎస్), ఆర్.ఎల్పీ., శిరోమణి అకాలీదళ్ (మాన్) ఉన్నాయి. ఈ 11 పార్టీలకు కలిపి మొత్తం 91 మంది ఎంపీలు ఉండటం గమనార్హం.
వీటిలో వైసీపీ, బీఆరెస్స్, బిజూ జనతాదళ్ కలిసి సుమారు 63 ఎంపీ స్థానాలుండటం గమనార్హం. వీటిలో ప్రధానంగా తెలంగాణలో టీఆరెస్స్.. బీఆరెస్స్ గా మారి జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేక కూటమి కట్టాలని కూడా ఆ పార్టీ ఈ ఏడాది ప్రారంభంలో ప్రయత్నాలు చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో అటు కాంగ్రెస్ కూడా శతృవుగా మారింది.
ఇదే సమయంలో మిగిలిన రెండు బలమైన తటస్థ పార్టీలూ అయిన వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్ అవసరం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నప్పటికీ... వారు ఎన్డీఏ భాగస్వాములుగా ముద్ర వేసుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది.
పైగా... రాబోయే రోజుల్లో కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలన్నా వైసీపీ పాత్ర కీలకంగా ఉంటుంది అని విజయసాయి రెడ్డి ఈ మధ్యనే ట్విట్టర్ లో స్పందించారు. అంటే... ఈ విషయంలో వైసీపీ పక్కా ప్లానింగ్ తో ఉందని తెలుస్తుంది. ఈమూడు బలమైన తటస్థ పార్టీల సంగతి అలా ఉంది.
ఇక ఏపీలో గతమెంతో ఘనం అయిన టీడీపీకి ప్రస్తుతం పార్లమెంట్ లో లోక్ సభలో మూడు, రాజ్యసభలో 1 కలిపి నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయినప్పటికీ పాతస్నేహాన్ని బీజేపీ రిపీట్ చేయాలని భావించినట్లు లేదని తెలుస్తుంది. ఒక్కస్థానం కూడా లేని జనసేన వంటి సుమారు 20కి పైగా పార్టీలను సమావేశానికి పిలిచింది.. కానీ, టీడీపీని మాత్రం ఆహ్వానించలేదు.
2014లో బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా టీడీపీకి ప్లస్ అయ్యిందని అంటుంటారు. ఫలితంగా టీడీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ తర్వాత కాలంలో బీజేపీకి దూరమై.. ఆ పార్టీపైనా, ప్రధాని మోడీపైనా, అమిత్ షా పైనా చంద్రబాబు అనేక సంచలన ఆరోపణలు చేశారు. దీంతో చంద్రబాబు వైఖరిపై వారికి వచ్చిన స్పష్టతవల్లో ఏమో.. బీజేపీ పెద్దలు టీడీపీని పూర్తిగా దూరం పెట్టేశారని తెలుస్తుంది.
ఇదే సమయంలో 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో జతకట్టారు చంద్రబాబు. అయితే ఆ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పొందడానికి కారణం టీడీపీతో పొత్తనే విషయం వారు తర్వాత గ్రహించారని కథనాలొచ్చాయి. దీంతో... ఆ కూటమి కూడా చంద్రబాబుని దూరం పెట్టింది. ఫలితంగా... బాబు తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది.
మరోపక్క రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోపిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికారపక్షంపై వ్యతిరేక గళమెత్తాలని ఆ పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. తొలిరోజు మణిపూర్ ఘటనపై చర్చ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేసిన వారిలో ఆ పార్టీ నేతలూ ఉన్నారని తెలుస్తుంది.
ఇదే సమయంలో తమను అంటరాని పార్టీగా చూస్తున్నారని ఆరోపిస్తూ మజ్లిస్ అధినేత ఒవైసీ ఇండియా కూటమికి దూరంగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ తో సానుకూలంగా ఉన్నప్పటికీ... ప్రస్తుతం ఆయనను ఆ గ్రూపు పిలవలేదు! అయితే... ఈ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, కర్ణాటకల్లో ప్రభావం చూపే అవకాశముందని అంటుంటారు.
ఈ నేపథ్యంలో... మాది 38 పార్టీల బలమైన కూటమి అని బీజేపీ చెప్పుకుంటున్నా... వాటిలో సుమారు 20కి పైగా పార్టీలకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ సున్నా సీట్లని తెలుస్తుంది. ఇదే విషయాలపై స్పందించిన ఖర్గే... ఆ 38లో ఎన్ని రిజిస్టర్డ్ పార్టీలో చెప్పాలంటూ సెటైర్స్ కూడా వేశారు.
మరోపక్క కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాస్త కొత్త ఉత్సాహంతో ఉంది కాంగ్రెస్. ఆ ఫలితాల అనంతరం విపక్షాలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూడటం మొదలుపెట్టాయి. ప్రస్తుతానికి ప్రధాని అభ్యర్థి ఎవరనేది చెప్పలేకపోయినా... ఈసారి ప్రభావం చూపాలను చూస్తున్నాయి.
దీంతో... 2024 ఎన్నికల్లో ఎన్డీయే - ఇండియా కూటముల్లో ఏదైనా గ్రూపు మెజార్టీ స్థానాలు గెలుచుకుంటే సరే. కానీ... లేదంటే మాత్రం ఈ తటస్థ పార్టీలకు ఫుల్ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్ గా జగన్ కూడా 2019లో మోడీకి ఇలాంటి అవసరమే వస్తాదేమో.. ఫుల్ గా క్యాష్ చేసుకుందాం అని అనుకున్నారని ఆయనే చెప్పిన సంగతి తెలిసిందే.
మరి 2024 ఎన్నికల తర్వాత అయినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కూటమికి ఏపీలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన పార్టీ అవసరం వస్తే... అప్పుడైనా విభజన హామీలు పరిపూర్ణంగా పొందగలిగితే రాష్ట్రానికి చాలా మంచి జరిగినట్లే! అయితే... ఈ 11 తటస్థ పార్టీలూ ఎన్నికల వరకూ ఇలా తటస్థంగానే ఉంటాయా.. లేక మధ్యలో మనసు మార్చుకుంటాయా అన్నది వేచి చూడాలి.