టికెట్ ఇవ్వాలా.. వద్దా.. కీలక నేతల విషయంలో వైసీపీ తర్జన భర్జన
సొంత కుటుంబానికే చెందిన వారు కావడంతో వారికి టికెట్లు ఖాయమనే వాదన వినిపిస్తున్నా
By: Tupaki Desk | 28 July 2023 4:16 AM GMTవచ్చే ఎన్నికల్లో సిట్టింగులు అందరికీ టికెట్లు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. కొందరి విషయంలో మాత్రం తప్పదు అనే నిర్ణయానికి వైసీపీ అధినేత జగన్ వచ్చినట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ 'తప్పదు' అనే జాబితాలో ఒకరిద్దరు సొంత వ్యక్తులు ఉన్నారు. సొంత కుటుంబానికే చెందిన వారు కావడంతో వారికి టికెట్లు ఖాయమనే వాదన వినిపిస్తున్నా.. ఇప్పుడు పరిస్థితి అంత అనుకున్నట్టుగా అయితే లేదనే చర్చ తెరమీదికి వచ్చింది.
వీరిలో సీఎం జగన్ సొంత మేనమామ పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిల పేర్లు తాజాగా తెర మీదికి వచ్చాయి. వీరికి టికెట్ల విషయం పార్టీ తర్జన భర్జన పడుతోందన్నది తాడేపల్లి వర్గాలు చెబుతున్నా యి. నిజానికి వీరి విషయం అసలు చర్చకు రావడమే ఒక వింత. ఎందుకంటే.. సీఎం జగన్‌తో వీరికి ఉన్న అనుబంధం, స్నేహం అలాంటివి. పైగా ఇద్దరూ కుటుంబ సభ్యులే. కానీ.. ఇటీవల కాలంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు చర్చకు రావడంతో స్థానికంగా అవినాష్‌పై వ్యతిరేకత పెరిగిందనే వాదన ఉంది.
ఇక, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డిపై సొంత నేతలే తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికి రెండు సార్లు తాడేపల్లిలో పంచాయతీ కూడా జరిగింది. దీనిని సర్ది చెప్పి.. రాజకీయం గా ఏదో ఒకటి చేయాలని అనుకున్నా.. పరిస్థితి సర్దు మణుగడం లేదు. గత ఎన్నికల్లో జెండా మోసిన వారిని పట్టించుకోవడం లేదని.. ఇతర నియోజకవర్గాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా విమర్శలు వస్తున్నాయి. గడప గడపలోనూ.. ఎమ్మెల్యేకు సమస్యలు స్వాగతం చెబుతున్నాయి. ఈ పరిణామాలతో ఈ ఇద్దరు నాయకుల విషయంలో వైసీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.
తాజాగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌తో బేటీ అయ్యారు. ఆయన రాక వెనుక టికెట్ విషయమే ఉండి ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో నియోజకవర్గం ఇంచార్జ్‌గా కూడా ఆయనను తప్పించి వైఎస్ కుటుంబానికి చెందిన మరో వ్యక్తికి అప్పగించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. తాజాగా అవినాష్ భేటీ కావడం ఈ చర్చకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.