Begin typing your search above and press return to search.

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

జీడీ నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఓటమిపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వి.ఎం. థామస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు జెడ్పీటీసీ, మూడు ఎంపీపీ స్థానాలు కోల్పోవడానికి సొంత పార్టీ నేతల వెన్నుపోటే కారణమని ఆరోపించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ ఓడిపోతే 2029లో ఎమ్మెల్యేగా ఉండనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   19 Nov 2026 11:00 PM IST
సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు
X

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించినప్పటికీ, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు) నియోజకవర్గంలో ఎదురైన పరాజయంపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వి.ఎం. థామస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ, మూడు ఎంపీపీ స్థానాలను కోల్పోవడం తనకు ఎంతో అవమానంగా ఉందని, ఈ ఓటమి వల్ల అసెంబ్లీలో సహచర ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడలేక పోతున్నానని ఆయన వాపోయారని చెబుతున్నారు. నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన సొంత పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. కొంతకాలంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఇతర నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నేతల మధ్య సఖ్యత, సమన్వయం లేకపోవడం వల్లే స్థానిక ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సివచ్చిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వాదన మాత్రం మరోలా ఉంది.

పంచాయతీ ఎన్నికలే కీలకం.. 2029పై సంచలన వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికల్లో ఓటమితో షాక్ కు గురైన ఎమ్మెల్యే థామస్ పంచాయతీ ఎన్నికలపై అలర్ట్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. "రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనైనా కష్టపడి పనిచేసి మెజారిటీ సర్పంచ్ స్థానాలను గెలిపించుకోవాలి. ఒకవేళ పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోతే, 2029 ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా ఉండను" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే ఉద్దేశం లేనివారు ఇప్పుడే వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోవచ్చని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

సొంత నేతల వెన్నుపోటు?

ఎన్నికల్లో ఓటమికి వైఎస్సార్‌సీపీ బలం కంటే సొంత పార్టీ నేతల వెన్నుపోటే ప్రధాన కారణమని థామస్ ఆరోపించారు. కొందరు టీడీపీ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం వైఎస్సార్‌సీపీ నేతలతో చేతులు కలిపి కూటమి అభ్యర్థులను ఓడించారని మండిపడ్డారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులమని చెప్పుకునే కొందరు నేతలు కనీసం తమ సొంత గ్రామంలో లేదా పరిధిలో ఒక ఎంపీటీసీ అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. కనీసం ఒక్క అభ్యర్థిని గెలిపించుకోలేని వారికి పార్టీలో పదవులు ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు.

జీడీ నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో కూటమికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఎమ్మెల్యే థామస్ సొంత మండలమైన కార్వేటినగరం జెడ్పీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి బాలాజీరెడ్డిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బండి జగదీష్‌రెడ్డి విజయం సాధించడం చర్చనీయాంశమైంది. వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం, పెనుమూరు మండలాల్లోనూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. నియోజకవర్గ కేంద్రమైన గంగాధర నెల్లూరు జెడ్పీటీసీ స్థానాన్ని మాత్రమే టీడీపీ కేవలం 304 ఓట్ల స్వల్ప మెజారిటీతో నిలబెట్టుకోగలిగింది.

స్థానిక టీడీపీ నేతల మధ్య ఉన్న తీవ్రమైన వర్గ విభేదాలు, కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల మధ్య సమన్వయ లోపం ఈ ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. మరోవైపు, అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యే తమను సంప్రదించలేదని, వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు పాతతరం టీడీపీ నేతలు అసంతృప్తితో ఉండటం వల్లే ఎన్నికల్లో సహకరించలేదని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాబోయే పంచాయతీ ఎన్నికల నాటికైనా ఎమ్మెల్యే థామస్ ఈ అంతర్గత విభేదాలను చక్కదిద్దుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.