విజయనగరం.. బాబు వరం ఎవరికి?
ఈ నెల 23న విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా, ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. మజ్జి సిరిసహస్ర, పాశల నీరజ, కర్రోతు చంద్రకళ ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. సిరిసహస్ర సామాజికవర్గంపై వివాదం కోర్టులో ఉండటంతో తుది నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
By: Garuda Media | 19 Nov 2026 3:25 PM ISTమరో మూడు రోజుల్లో ప్రమాణ స్వీకార ఘట్టానికి తెరలేవనుంది. కానీ.. ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఎవరిని ఎంపిక చేస్తారో.. ఎవరిని పక్కన పెడతారో.. అన్న ఉత్కంఠతో బీపీ పెరిగిపోయి.. నాయ కులు, నాయకురాళ్లు సైతం తల్లడిల్లుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా పరిషత్ స్థానానికి సంబంధించిన `చైర్ పర్సన్` ఎంపిక వ్యవహారం.. సస్పెన్స్‌గా మారింది. ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న ముగ్గురు మహిళలుఈ పీఠం కోసం వేచి చూస్తున్నారు.
అంతేకాదు.. వీరికి బలమైన నేపథ్యం ఉండడం, సామాజికవర్గం పరంగా బలమైన పునాదులు, పలుకుబడి ఉండ డంతో ఎవరికివారు ఈ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వీరిలో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మజ్జి శ్రీను కుమార్తె మజ్జి సిరిసహస్ర, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రధాన అనుచరురాలిగా గుర్తింపు పొందిన పాశల నీరజతోపాటు.. గత ఎన్నికల సమయంలో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీచేయాలని అనుకుని కూడా చంద్రబాబు ఆదేశాలతో వెనక్కి తగ్గిన.. పార్టీకి వీర విధేయుడు కర్రోతు బంగార్రాజు కుమార్తె కర్రోతు చంద్రకళ ఉన్నారు.
ఎన్నికలకు ముందు.. మజ్జి శ్రీను కుమార్తెకు జడ్పీ పీఠం హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆమె బీసీ సామాజిక వర్గం అయితే.. ఈ విషయంలో ఆమె తేడా చేశారని.. వేరే సామాజిక వర్గం అని పేర్కొన్నారని ఆరోపిస్తూ.. వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం తేలేందుకు మరోమూడు మాసాల సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ.. సిరి సహస్ర మాత్రం తనకే పీఠంఇవ్వాలని పార్టీ అధినాయకత్వాన్ని కోరుతోంది.
ఇక, కర్రోతు కుమార్తు చంద్రకళ.. కూడా టీడీపీ విషయంలో తమ కుటుంబం చేసిన సేవలను ప్రస్తావిస్తున్నారు. ఆది నుంచి వీరవిధేయులుగా ఉన్నామని.. ఇప్పుడు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తన తండ్రి పార్టీ కోసం.. టికెట్ కూడా త్యాగం చేశారని అంటున్నారు. మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అనుచరురాలిని ఎలాగైనా జడ్పీపీఠంపై కూర్చోబెట్టాలని పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. దీంతో ఈ ముగ్గురి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. మరోవైపు ఈ నెల 23న ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉంది. మరి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారు? ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తిగా మారింది.
