Begin typing your search above and press return to search.

కోల గురువులు మీద విశాఖ వైసీపీ బరువులు

By:  Tupaki Desk   |   22 July 2023 3:48 AM GMT
కోల గురువులు మీద విశాఖ వైసీపీ బరువులు
X

కోలా గురువులు రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారు. 2009లో విశాఖ సౌత్ లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. 2014 నాటికి వైసీపీ నుంచి పోటీ పడి గెలుపు అంచులకు వచ్చేశారు. అయినా బ్యాడ్ లక్ పలుకరించింది. 2019 నాటికి టికెట్ జగన్ ఇవ్వలేదు. అయినా పార్టీకి సహకరించారు. ఆయనకు పార్టీ పట్ల చిత్తశుద్ధి విధేయతను చూసి జగన్ వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీ ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ వంటి కీలకమైన పదవిని ఇచ్చారు.

ఆ తరువాత ఆయనకు ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అయితే ఒక్క ఓటు తేడాతో ఆయన ఓటమి పాలు అయ్యారు. దాంతో ఆయనకు విశాఖలోని ప్రతిష్టాత్మకమైన డీసీసీబీ చైర్మన్ పదవిని తాజాగా ఇచ్చారు. ఇది క్యాబినేట్ ర్యాంక్ హోదా కలిగినది. ఇపుడు దానికి అదనంగా విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారు.

పంచకర్ల రమేష్ బాబు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పదవిని కోలా గురువులుతో భర్తీ చేశారు జగన్. సంప్రదాయ మత్యకార వర్గానికి చెందిన బీసీ నేత అయిన కోలా గురువులుకు ఒకటి రెండు రోజుల తేడాలో కీలకమైన పదవులు రెండు రావడంతో పార్టీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. గడచిన నాలుగేళ్లలో కోలా గురువులు నాలుగు పదవులు ఇచ్చి జగన్ ఏ నేతకూ ఇవ్వనంత ప్రాధాన్యత ఇచ్చారు.

ఇదిలా ఉంటే విశాఖ సిటీలో టీడీపీ బలంగా ఉంది. జనసేన కూడా బాగా పుంజుకుంది. పొత్తులు ఉంటే రెండు పార్టీలు గట్టిగానే పోటీని ఇస్తాయి. ప్రస్తుతం విశాఖలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లలో మూడు టీడీపీ చేతిలో ఉన్నాయి. మరో వైపు చూస్తే టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి జంప్ చేశారు.

దాంతో పాటు విశాఖ కార్పొరేషన్ వైసీపీ చేతిలో ఉంది. 62 మంది కార్పోరేటర్లు ఆ పార్టీకి ఉన్నారు. విశాఖ ఎంపీ వైసీపీకి చెందిన వారే ఉన్నారు. అయితే విశాఖలో పట్టు సాధించడం అంత సులువు కాదు, ఇక్కడ ప్రజలు విలక్షణమైన తీర్పు ప్రతీ ఎన్నికలోనూ ఇస్తారు. దాంతో కీలకమైన తరుణంలో వైసీపీ జిల్లా బాధ్యతలు కోలా గురువులుకి ఇవ్వడం పట్ల పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల సంవత్సరంలో ఆయన ఇంతటి బరువు బాధ్యతలను మోయగలరా అన్న చర్చ సాగుతోంది. విశాఖ జిల్లాలో కాపులు ఎక్కువ. నగర పరిధిలో చూస్తే యాదవుల జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది. టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ గా యాదవ సామాజికవర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన బీసీ నేత.

ఇపుడు వైసీపీ కూడా బీసీ నేతకే ఈ బాధ్యతలు అప్పగించింది. బీసీలను ఆకట్టుకునే ప్రయత్నంలోనే ఈ ఎంపిక జరిగింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే వైవీ సుబ్బారెడ్డి రీజనల్ కో ఆర్డినేటర్ గా దూకుడు చేయాల్సి ఉంది. నెమ్మదిగా ఉండే కోలా గురువులుని ప్రెసిడెంట్ గా చేయడం వల్ల పార్టీలో జోష్ నింపడం కూడా చూసుకోవాలని అంటున్నారు.

అయితే వైసీపీ మీద హై కమాండ్ స్పెషల్ ఫోకస్ ఉంటుందని, మిగిలిన జిల్లాల కంటే ఇక్కడ ఎక్కువగా హై కమాండ్ అండదండలు ఇస్తుందని, దాంతో కోలా గురువులు ఆ డైరెక్షన్ లో పనిచేయడమే అని అంటున్నారు ఏది ఏమైనా కోలా గురువులుతో పాటు వైవీ సుబ్బారెడ్డి కూడా తమ సత్తా చాటుకోవాల్సిన తరుణం ఇదే అంటున్నారు.

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీని పరుగులు పెట్టించాల్సిన వైసీపీ నాయకత్వం ఆ దిశగా పావులు కదపాల్సి ఉంది. అదే విధంగా విశాఖ నగరం అంటే మినీ ఇండియాగా ఉంటుంది. ఇక్కడ చదువుకున్న వారు మేధావులు, ఉద్యోగస్థులు ఎక్కువ. వారిని అభివృద్ధితోనే ఆకట్టుకోవాల్సి ఉంది. వైసీపీకే ఇది అగ్నిపరీక్ష. ఈ విషయంలో కోలా గురువులు ఎంతవరకూ సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.