Begin typing your search above and press return to search.

చిన్నమ్మకు చిక్కులే...ఉక్కు లెక్క తేల్చాల్సిందే...?

విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగేలా

By:  Tupaki Desk   |   25 July 2023 3:49 AM GMT
చిన్నమ్మకు చిక్కులే...ఉక్కు లెక్క తేల్చాల్సిందే...?
X

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవికి అనూహ్యంగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఎంపిక అయ్యారు. కేంద్ర బీజేపీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయో అంచనాలు ఏ విధంగా వేసుకున్నారో తెలియదు కానీ ఆ పదవి ఆమెకు దక్కింది. బీజేపీలోకి ఆమె వచ్చి తొమ్మిదేళ్ళు అయింది. ఆమెకు బీజేపీలో పూర్తి స్థాయి పట్టు ఉందా లేదా అన్నది కూడా కేంద్ర పెద్దలు లెక్కలు వేసుకున్నారా లేదా తెలియడంలేదు.

అయితే ఇన్నాళ్ళూ మహా నగరాల్లో ప్రెస్ మీట్లు పెట్టేసి వెళ్లిపోయే చిన్నమ్మ ఇపుడు కాలికి బలపం కట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఆమె రాయలసీమ మీదుగా జిల్లా పర్యటనలు స్టార్ట్ చేశారు. ఈ నెల 27న ఆమె విశాఖ వస్తున్నారు. విశాఖలో చిన్నమ్మకు పార్టీ నాయకులు ఎటూ స్వాగతం పలుకుతారు.

అదే టైం లో ఆమెకు అనేక సమస్యలు కూడా స్వాగతం చెప్పనున్నాయి. ముఖ్యంగా విశాఖ ఉక్కు సమస్య పురందేశ్వరికి కొత్త చిక్కులు తెచ్చేలా ఉంది అని అంటున్నారు. పురందేశ్వరి పార్టీ అధ్యక్షురాలు అయ్యారని తెలియడంతోనే విజయవాడకు వెళ్ళిన ఉక్కు ఉద్యమకారులు ఆమెకు వినతిపత్రం ఇచ్చి ఉక్కు గురించి ఆలోచించమని కోరారు.

విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగేలా చూడాలని కూడా రిక్వెస్ట్ చేశారు. విశాఖ ఉక్కుకి నష్టాలు వస్తూంటే అలా భావించినట్లు అయితే సొంతంగా నడపాలని లేకపోతే మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెయిల్ లో విలీనం చేయాలని కోరారు. అంతే తప్ప ప్రైవేట్ పరం చేయవద్దని, ఎవరో ఒకరికి దారాదత్తం చేయవద్దని గట్టిగా కోరారు.

ఇపుడు పురందేశ్వరి విశాఖ తానే వస్తున్నారు. ఆమె విశాఖలో ఉత్తరాంధ్రా బీజేపీ పదాదికారుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమెను మరోసారి ఉక్కు కార్మిల వర్గం నాయకులు కలుస్తారు అని అంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలతో మాట్లాడి ప్రైవేట్ పరం చేయమని హామీని తీసుకోవాలని కోరనున్నారని అంటున్నారు.

ఇది నిజంగా ఆమెకి చిక్కు సమస్యగానే చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా పురందేశ్వరి విశాఖకు పలు మార్లు ఒక పార్టీ నాయకురాలిగా వచ్చారు. అపుడు విశాఖ ఉక్కు గురించి అంతా మంచే జరుగుతుంది అని మాట్లాడేసి వెళ్ళిపోయారు. కానీ ఈసారి అలా చేయడానికి వీలు లేదు. పైగా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఏపీలో ముఖ్య నగరంలో అత్యంత కీలకమైన విశాఖ ఉక్కు విషయంలో ఎంపీ మాట చెప్పి తీరాలి. విశాఖ ఉక్కు కోసం గట్టి భరోసా ఇవ్వాలి

పైపెచ్చు పురంధేశ్వరి విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉక్కు అతి పెద్ద ఇష్యూగా మారుతుంది అని అంటున్నారు. ఈ విషయంలో ఊరటను ఇచ్చే విధంగా ఏపీ బీజేపీ పెద్దగా పురంధేశ్వరి మాట్లాడకపోతే ఆమె విశాఖ ఆశలు జిల్లా టూర్ కూడా ఇబ్బందిగా మారుతాయని అంటున్నారు.

మరి విశాఖలో ఉక్కు కర్మాగారం మీద కేంద్ర పెద్దలను ఒప్పించి ప్రైవేటీకరణను రద్దు చేయించగలరా. పోనీ కార్మికులు కోరుతున్నట్లుగా ప్లాన్ బీ కింద సెయిల్ లో అయినా విలీనం చేయిస్తామని హామీ ఇప్పించగలరా. ఈ నెల 27న పురందేశ్వరి విశాఖ రాక సందర్భంగా ఏమి జరుగుతుంది. విశాఖ ఉక్కు కార్మికుల డిమాండ్లను ఆమె ఏ విధంగా చూస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.