విజయసాయిరెడ్డి ఎక్కడ? పార్టీ ప్రకటన తర్వాత కనిపించని పీఆర్పీ అధినేత
కొత్తగా పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) ప్రకటించిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పార్టీ విస్తరణ వ్యూహాలపై కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జెన్ జీ యువత, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు డిజిటల్ ప్రచారంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 16 Nov 2026 12:21 PM ISTకొత్తగా పార్టీ ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్కడున్నారనే విషయమై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నెల 11న పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ)ని స్థాపిస్తున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆయన తెరచాటు రాజకీయ వ్యూహాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంలోనూ ఆ పార్టీ విస్తరణలో కీలకంగా పనిచేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు తన సొంత పార్టీ కోసం ఒంటరిగా వ్యూహాలు రచించుకోవాల్సివచ్చిందని అంటున్నారు. తన పార్టీలో జెన్ జీ యువత, బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇస్తానని ప్రకటించిన విజయసాయిరెడ్డి ఆయా వర్గాలను ఆకర్షించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే అంశంపై నిపుణులతో సంప్రదిస్తున్నారని, ప్రస్తుతం ఈ పనుల్లో బిజీగా ఉన్నందున ఇతరులకు అందుబాటులో లేరని చెబుతున్నారు.
సహజంగా ఎవరైనా రాజకీయ పార్టీ ప్రకటించిన వెంటనే కొత్త వారిని చేర్చుకోవడానికి తమ పార్టీ సిద్ధాంతాలు తెలియజేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. విస్తృత పర్యటనలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రాధాన్యమిస్తారు. కానీ, విజయసాయిరెడ్డి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు. తన పార్టీని డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా సోషల్ మీడియాకు కనెక్ట్ అయివున్నందున తాను కూడా డిజిటల్ విధానంలో పార్టీ ప్రచారం చేసి అందరికీ దగ్గరవ్వాలని విజయసాయిరెడ్డి వ్యూహంగా చెబుతున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ వేదికగా నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
ప్రధానంగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో విజయసాయిరెడ్డి చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వైసీపీకి సలహాదారుగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ను తాను వాడుకోవాలని విజయసాయిరెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ, ప్రశాంత్ కిషోర్ మధ్య డీల్ కుదర్చడంలో విజయసాయిరెడ్డిది కీలక పాత్రగా చెబుతున్నారు. అప్పటి పరిచయంతో ఆయనను తనకు సలహాదారుగా ఉండాలని విజయసాయిరెడ్డి సంప్రదించారని ఢిల్లీ వర్గాల భోగట్టా. అయితే ప్రస్తుతం సొంత పార్టీ పెట్టుకున్న పీకే ఈ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. అదేసమయంలో విజయసాయిరెడ్డితో ఉన్న పరిచయం కారణంగా తన శిష్యులతో మాట్లాడి మంచి వ్యూహకర్తను నియమించుకునేలా సాయం చేస్తానని పీకే హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో విజయసాయిరెడ్డి ఉన్నారని చెబుతున్నా, ఆయన పర్యటనలు, భేటీలు అన్నీ రహస్యంగా సాగుతున్నాయని చెబుతున్నారు. దీంతో విజయసాయిరెడ్డి కదలికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అవుతానని చెబుతున్న విజయసాయిరెడ్డి రానున్న రెండేళ్లలో ఒక పద్ధతి ప్రకారం పార్టీని విస్తరించే ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలువురు వైసీపీ నేతలతో ఆయన చర్చలు సాగిస్తున్నారని, విజయసాయిరెడ్డి పార్టీకి ప్రజల్లో ఆదరణపై భిన్నాభిప్రాయాలు ఉండటంతో వారు వెనక్కి తగ్గుతున్నారని చెబుతున్నారు. అయితే పాత నేతలకు బదులుగా కొత్తవారితోనే ప్రయోగం చేయాలని విజయసాయిరెడ్డి భావిస్తున్నారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. మొత్తానికి పీఆర్పీ ప్రకటన తర్వాత విజయసాయిరెడ్డి బయట కనిపించకుండా తిరుగుతుండటం, ఆయన వ్యూహకర్తలతో సంప్రదిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
