'యువ సారథ్యం' టీడీపీకి కలిసి వచ్చిందా.. !
స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకోవడానికి యువతకు అవకాశాలు కల్పించడం ప్రధాన కారణమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. యువ ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వేచ్ఛ ఇవ్వడంతో శ్రీకాళహస్తి, నగరి సహా పలు ప్రాంతాల్లో పార్టీ బలపడిందని చెబుతున్నారు. నెల్లూరు రూరల్‌లో జెన్‌జీ యువతకు, పోరుమామిళ్లలో 22 ఏళ్ల శివసాహితికి అవకాశం కల్పించడం చర్చనీయాంశమైంది.
By: Garuda Media | 28 Nov 2026 10:10 PM ISTస్థానిక సంస్థల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు కూడా టీడీపీ పుంజుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయం లో వచ్చిన 94 శాతం స్ట్రయిక్ రేట్.. తిరిగి సాధించడంలో పార్టీ సక్సెస్ అయింది. దీనికి ప్రధానంగా యువతకు స్వేచ్ఛనివ్వడం.. పనిచేసిందని అంటున్నారు. మరీ ముఖ్యంగా.. యువతకు అవకాశం ఇవ్వడంతోపాటు.. యువ ఎమ్మెల్యేలకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం పార్టీని విజయం దిశగా నడిపించిందని అంటున్నారు. శ్రీకాళహస్తి, నగరి వంటి కీలక యువ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో పార్టీ పుంజుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ యువ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి బాగానే ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేల పనితీరుకు ఈ ఎన్నికలు కొలమానంగా కూడా ఉంటాయని.. పార్టీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో యువ ఎమ్మెల్యేలు మనసు పెట్టి పనిచేశారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం, యువత భాగస్వామ్యం, స్థానిక నేతల పాత్రవంటివి కీలకంగా మారాయి. ఎక్కడికక్కడ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
స్థానిక, పరిషత్ ఎన్నికలతోపాటు.. గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి విడత పోలింగ్ లో యువ ఎమ్మెల్యేలు కసిగా పనిచేశారు. కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నా.. అభ్యర్థుల ఎంపిక, పార్టీ అధిష్టానం నిర్దేశించిన నియమాల ప్రకారం.. నాయకులు వ్యవహరించారు. ఇది పార్టీ విజయానికే కాకుండా ఎమ్మెల్యేల పనితీరుకు కూడా కొలమానంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అవకాశాలు కల్పించడంలో భాగంగా, నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 'జెన్ జీ` యువతకు సీట్లు కేటాయించారు.
అలాగే కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేట పంచాయతీలో 22 ఏళ్ల యువతి శివసాహితి టీడీపీ మద్ద తుతో సర్పంచ్ బరిలో నిలిచారు. శ్రీకాళహస్తి, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి ఇలా.. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ యువ నేతలు కలసి కట్టుగా ముందుకువ చ్చారు. ఈ విజయాన్ని వచ్చే ఎన్నికలకు కీలకమైన రెడ్ కార్పెట్‌గా మార్చుకున్నారు. తద్వారా కేడర్‌లో కసి పెంచి.. పార్టీని గెలుపు గుర్రం ఎక్కేలా చేశారని అంటున్నా రు. కొన్ని చోట్ల ఈ నిర్ణయాలు వివాదానికి దారితీసినా.. కట్టు తప్పకుండా జాగ్రత్తగా నాయకులు వ్యవహరించారని చెబుతున్నారు. ఎలా చూసుకున్నా.. యువ నేతల హవా ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
