ఏపీలో మరో కొత్త పార్టీ ఉద్భవించింది. రాజకీయ నేత రామచంద్రయాదవ్ నేతృత్వంలో 'భారత చైతన్య యువజన పార్టీకి శ్రీకారం చుట్టారు. అయితే.. ఏ పార్టీ అయినా.. ప్రజల్లోకి వెళ్లాలి. వారి ఆశీస్సులు పొందాలి. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీని స్థాపించుకునే హక్కు, అవకాశం రెండూ ఉంటాయి. ఈ క్రమం లోనే రామచంద్రయాదవ్ పార్టీని కూడా స్వాగతించాల్సిందే. అయితే.. ప్రధానంగా ఈ పార్టీ ఉద్దేశం అధికా రమేనని తేల్చేయడమే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
ఎందుకంటే.. పార్టీ ఏదైనా ముందు ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి. ప్రజల మనసులు గెలుచుకు నే ప్రయత్నం చేయాలి. విభిన్న సమస్యలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలను దగ్గరకు చేసుకునే ప్రయత్నా లు సాగించాలి. అదేసమయంలో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేసే తత్వాన్ని కూడా అలవరుచుకోవాలి. కానీ, ఎన్నికలకు 8 మాసాల ముందు పార్టీ పెట్టి.. అధికారమే ధ్యేయంగా అడుగులు వేయడానికి ఇదేమీ 1983 నాటి వాతావరణం కాదు.
సరే.. ఈ విషయం ఎలా.. ఉన్న కొత్తగా ఏర్పాటు చేసిన భారత చైతన్య యువజన(బీసీవై) పార్టీ అధ్యక్షుడి గా ఉన్న రామచంద్రయాదవ్ బీసీలు కేంద్రంగా చక్రం తిప్పుతానని ప్రకటించారు. బీసీలను వాడుకుని వదిలేస్తున్నారని.. వారికి ప్రాధాన్యం లేకుండా పోతోందని కూడా చెబుతున్నారు. అంత మాత్రాన ఆయన ఏకంగా తమకు అధికారం ఇచ్చేయాలని కోరడం విడ్డూరంగా ఉందనే చర్చ సాగుతోంది. బీసీల సమస్యల పై పోరాటం చేస్తున్నవారు.. పోరాడేవారు చాలా మంది ఉన్నారు.
బీసీలు రాజకీయాలకు ఇప్పుడు కొత్తకాదు. వారి సమస్యలు కూడా కొత్తవి కాదు. ఏళ్ల తరబడి అలానే ఉన్నా యి. ముందు వాటిపై శ్రద్ధ పెట్టి.. వాటిని పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వంపై పోరాటం చేసి ఉంటే రామచంద్రయాదవ్‌ను నమ్మే పరిస్థితి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. అలా కాకుండా.. కేవలం అధికారం కోసం పార్టీ పెట్టడం.. ఆ వెంటనే అధికారంలోకి వచ్చేయాలని పేర్కొనడం ఏదో తేడా కొడుతోందని.. ఏదో ఒక పార్టీకి అనుబంధం ఓట్లు చీల్చే కార్యక్రమం కోసం ఉద్భవించిన పార్టీగా చర్చ సాగుతుండడం గమనార్హం.