Begin typing your search above and press return to search.

కలసి ఉండాల్సిందే...బాబు పవన్ బీజేపీ ఈక్వేషన్స్ ఇవే !

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యంగా కొనసాగుతుందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విడిపోతే ఓట్లు చీలి వైసీపీకి లాభం చేకూరుతుందని మూడు పార్టీలకు స్పష్టమైన అవగాహన ఉందని సమాచారం. 2019 ఎన్నికల అనుభవంతో పాటు తమ రాజకీయ బలాలు, పరిమితులను దృష్టిలో ఉంచుకుని 2029లోనూ కలిసి పోటీ చేయాలని కూటమి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

By:  Satya P   |   27 Nov 2026 8:00 AM IST
కలసి ఉండాల్సిందే...బాబు పవన్ బీజేపీ ఈక్వేషన్స్ ఇవే !
X

ఏపీలో రాజకీయాల గురించి సమీకరణాల గురించి చెప్పాలీ అంటే పెద్దగా రాజకీయ గణిత శాస్త్రం అసలు అవసరం లేదు. కూటమి కలసి ఉంటే వైసీపీకి ఇబ్బంది. విడిపోతే కూటమికి ఇబ్బంది. ఇది సింపుల్ ఆన్సర్. దీనికి ఉదాహరణలు 2014, 2019, 2024 కళ్ళ ముందు ఉన్నాయి. ఇక చూస్తే కూటమిగా తాము పదిహేనేళ్ల పాటు కలసి ఉంటామని పవన్ కళ్యాణ్ బయటకు చెబుతున్నారు. బీజేపీ కూడా అదే ధోరణి ప్రదర్శిస్తోంది. టీడీపీ కూడా అదే కరెక్ట్ అంటోంది. మూడు పార్టీలకూ వారి బలాలు పరిమితులు అన్నీ బాగా తెలుసు అని అంటున్నారు. అన్నింటికీ మించి ఏపీలో రాజకీయ పరిస్థితులు వైసీపీ బలాబలాల మీద కూడా ఈ మూడు పార్టీలకు కచ్చితమైన అంచనా ఉంది అని అంటున్నారు.

టీడీపీ పెద్దన్నగా :

ఇక చూస్తే కూటమిలో పెద్దన్నగా టీడీపీ ఉంది. నిజానికి ఏపీలో అతి పెద్ద ప్రాంతీయ పార్టీ కూడా టీడీపీనే. బూత్ లెవెల్ నుంచి ఆ పార్టీ ఉంది. కోటికి పైగా సభ్యత్వం ఉంది. పటిష్టమైన నాయకత్వం ఉంది. అన్ని సామాజిక వర్గాలనూ కలుపుకుని పోతున్న పార్టీగా కూడా టీడీపీని అంతా చూస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నలభై శాతం ఓటింగ్ టీడీపీకి ఉంది. అయినా సరే టీడీపీ ఒంటరి పోరు కంటే మిత్రులతో కలిసి వెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తోంది. దానికి కారణం 2019 అనుభవాలని అంటున్నారు. టీడీపీ ఓటు షేర్ నుంచే జనసేన బీజేపీ ఓట్లు చీలుస్తాయి. అలాంటపుడు కలసి ఉంటే కలదు బలం అన్నది టీడీపీ రాజకీయ వ్యూహం అని అంటున్నారు.

జనసేన లెక్క పక్కా :

ఇక పవన్ కళ్యాణ్ కి రాజకీయ అనుభవం లేదని 2024 ఎన్నికల్లో కూటమి కట్టిన తరువాత నుంచి ఎవరూ అనుకోవడం లేదు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వారు పవన్. జనసేనకు బలం కొంత పెరిగి ఉండొచ్చు. కానీ ఒంటరిగా వెళ్తే కనుక ఎన్నికల్లో దెబ్బ తింటామన్నది కూడా 2019 అనుభవం ఉందని తెలుసు అంటున్నారు. పైగా విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి వైసీపీకి రాజకీయ లాభం కలుగుతుందని పక్కాగా పవన్ కి తెలుసు అని అంటున్నారు. అలా జగన్ కి మరోసారి అధికారం ఇచ్చేందుకు పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది ఉండదని అంటున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేయవచ్చు కదా మనకు ఎంతో బలం ఉందని సైనికులు కానీ ఆ పార్టీ అభిమానులు కానీ సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు అయినా పెట్టవచ్చు కానీ పవన్ కి అన్నీ తెలుసు అని అంటున్నారు. అందుకే ఆయన కూటమి ఐక్యతను దెబ్బ తీసే ఎలాంటి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వరని చెబుతున్నారు. అందుకే పవన్ ఏపీ అభివృద్ధి కోసం కూటమి కలిసి ఉండాలనే అంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా జనసేన గ్రౌండ్ లెవెల్ లో కొంత బలపడింది. అయితే ఈ బలం సరిపోదని కూడా తెలుసు అని అంటున్నారు. సో జనసేన తానుగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమిని వీడదని చెబుతున్నారు.

బీజేపీకి ఆధారం :

ఇక కేంద్రంలో నాలుగవ సారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ఉత్తరాది ఆశలు అడుగంటుతున్నాయి. దక్షిణాదిన కర్ణాటక తప్ప ఎక్కడా రాజకీయంగా బలం లేదు, ఎంపీ సీట్లు ఎక్కువగా వచ్చేది ఏపీ నుంచే. అందుకే కూటమితో పొత్తు కట్టి ముందుకు సాగడమే కమలానికి అనివార్యం అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో ఇండియా కూటమి పుంజుకుంటుంది అన్న వార్తలు వస్తున్న క్రమంలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ఐక్యతను కాపాడుకుంటుందే తప్ప దూరం జరిగే ఆలోచన కలలో కూడా చేయదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పదులకు పైగా ఎంపీ సీట్లు ఏపీ నుంచి అందుకుంటే మరోసారి కేంద్రంలో అధికారానికి ఆశలు ఉంటాయన్నది కమలనాధుల అంచనా అని అంటున్నారు. మొత్తంగా చూసినపుడు కూటమి విడిపోయేది ఉండదు, అది మిత్ర పక్షాలలోని సొంత పార్టీ వారు అసంతృప్తి వ్యక్తం చేసినా లేదా వైసీపీ వంటి పార్టీలు ఆశించినా కూడా పూర్తి వాస్తవాలు అన్నీ కూటమి పెద్దలకు తెలుసు అని అంటున్నారు.