Begin typing your search above and press return to search.

నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!

నెల్లూరు టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జడ్పీ చైర్మన్ ఎన్నికలో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఆయనకు మద్దతుగా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఆరుగురు జడ్పీటీసీలు కూడా బయటకు వెళ్లారు. అయినప్పటికీ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

By:  Tupaki Desk   |   21 Nov 2026 3:23 PM IST
నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!
X

సింహపురి రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ ఎన్నికల వేళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లాలో ఏ నిర్ణయం జరిగినా సహచర మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల మాటే చెల్లుబాటు అవుతోందని, సీనియర్ మంత్రిగా ఉన్న తనకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదని ఆనం వర్గం రగిలిపోతోందని చెబుతున్నారు. జడ్పీ చైర్మనుగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసినట్లు చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయమై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మంత్రి ఆనం సరిగ్గా చైర్మన్ ఎన్నిక రోజు నిరసన గళం విప్పడానికి కారణాలు ఏంటన్నది హాట్ టాపిక్ అవుతోంది.

శుక్రవారం నెల్లూరు జడ్పీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన 35 మంది జడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం, అనంతరం జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందుగా జడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించగానే మంత్రి ఆనం ఒక్కసారిగా తన సీటులో నుంచి లేచి సమావేశాన్ని బహిష్కరిస్తూ బయటకు వెళ్లిపోయారు. ఆయనకు మద్దతుగా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు కూడా సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అయితే, మంత్రి సహా ఏడుగురు సభ్యులు బహిష్కరించినప్పటికీ, మిగిలిన సభ్యులతో ఎన్నికల ప్రక్రియను కొనసాగించిన అధికారులు జడ్పీ చైర్మన్‌గా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికను పూర్తి చేశారు.

నెల్లూరు రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఆనం కుటుంబానికి జిల్లాపై గట్టి పట్టు ఉండేది. కానీ, ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో తన ఆధిపత్యానికి గండిపడుతోందనే ఆవేదన మంత్రి ఆనంలో రానురాను పెరిగిపోతోందని చెబుతున్నారు. ముఖ్యంగా జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపికలో ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఆయనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని అంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఒకరిని జడ్పీ చైర్మన్ పదవికి ఆనం ప్రతిపాదించినట్లుగా చెబుతున్నారు. దీనికోసం జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలతో కలిసి వ్యూహరచన చేయడంతో పాటు, భారీగా ఖర్చు చేసేందుకు కూడా అభ్యర్థిని సిద్ధం చేశారని అంటున్నారు. కానీ, ఆనం ప్రతిపాదనను పక్కనపెట్టి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు ప్రతిపాదించిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసిందని అంటున్నారు. తనను కనీసం సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని మంత్రి ఆనం తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కేవలం జడ్పీ చైర్మన్ పదవి మాత్రమే కాకుండా, గతంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎంపికలోనూ మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి సిఫారసులకే అధిష్టానం మొగ్గు చూపిందని అంటున్నారు. జడ్పీ వైస్ చైర్మన్ పదవిని కూడా ఆనంకు తెలియకుండానే సర్వేపల్లి నియోజకవర్గానికి కేటాయించడంతో ఆయన అసహనం కట్టలు తెంచుకుందని చెబుతున్నారు. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీ బీ-ఫారంల కేటాయింపు నుంచే ఆనం వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కలేదనే వాదన బలంగా వినిపించింది. తన సోదరుడి కుమారుడు ఆనం రంగమయూర్ రెడ్డికి నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవి ఇప్పించుకునేందుకు, స్వయంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసానికి వెళ్లి అభ్యర్థించాల్సిన పరిస్థితి రావడం ఆనం వర్గీయులకు మింగుడుపడటం లేదని అంటున్నారు. జిల్లా రాజకీయాల్లో తొలి నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెత్తనాన్ని ఆనం అంతర్గతంగా వ్యతిరేకిస్తుండగా, గతంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశాల్లోనూ వీరి మధ్య ప్రొటోకాల్, ఆధిపత్య విభేదాలు బయటపడ్డాయని అంటున్నారు.

నెల్లూరు జిల్లాలో టీడీపీకి తిరుగులేని బలం ఉన్నప్పటికీ, నేతల మధ్య సమన్వయ లోపం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఆనం మాత్రమే కాదు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి వర్గాలు కూడా జడ్పీ పీఠం విషయంలో ఎంపీ వేమిరెడ్డి వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఏ నిర్ణయమైనా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని, సీనియర్ నేతల అభిప్రాయాలకు విలువ లేకుండా పోతోందని కొందరు స్థానిక నేతలు లోలోపల మదనపడుతున్నారని చెబుతున్నారు.