Begin typing your search above and press return to search.

అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం

ఏపీలో రెండో విడత మున్సిపల్ ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా అల్లూరులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నగర పంచాయతీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టీడీపీ, వైసీపీ నేతలు కలిసి ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు సమాచారం. అల్లూరు, సింగపేట, నార్త్ మోపూరు గ్రామాలను తిరిగి పంచాయతీలుగా కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 26న ఎన్నికలు జరగాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   15 Nov 2026 3:15 PM IST
అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం
X

రాష్ట్రంలోని రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 14న నామినేషన్ ప్రక్రియతో ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 23 పట్టణ సంస్థల ఎన్నిక పెండింగ్ లో పడిపోగా, ఈ నెల 26న వాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత మున్సిపల్ ఎన్నికలకు పార్టీలు సమాయుత్తమయ్యాయి. తొలి విడతలో హోరాహోరీగా పోరాడిన పార్టీలు రెండో విడతలో సత్తా చాటాలని నిర్ణయించాయి. ప్రధానంగా తొలివిడత ఫలితాలతో జోష్ తెచ్చుకున్న వైసీపీ రెండో విడతలో గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈ సారి 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే విపక్షం వైసీపీ రెండు కార్పొరేషన్లను గెలుచుకునే విషయంలో ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో పలు మున్సిపాలిటీలలో గెలుపుపై నమ్మకంగా ఉందని అంటున్నారు.

అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ మున్సిపాలిటీలో జరగనట్లు నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీ ఎన్నికను అడ్డుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి. ఆ పట్టణంలోని అధికార, ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఏ ఒక్కరూ నామినేషన్ వేయకుండా టీడీపీ, వైసీపీ నాయకులు అడ్డుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల వారు ఎదురు పడితేనే గొడవలు జరుగుతున్నట్లు పరిస్థితులు మారిపోతే, అల్లూరులో మాత్రం రెండు పార్టీల వారు కలిసి ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

నగర పంచాయతీ ఇష్టం లేకే..

కావలి నియోజకవర్గం పరిధిలోని అల్లూరు నగర పంచాయతీ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. అల్లూరు, సింగపేట, నార్తు మోపూరు గ్రామాలను కలిపి ఈ నగర పంచాయతీని ఏర్పాటు చేశారు. అయితే మూడు గ్రామాల వారు గ్రామ పంచాయతీలుగా కొనసాగడానికే మొగ్గుచూపుతున్నారు. గత ప్రభుత్వం నగర పంచాయతీగా ఏర్పాటు చేయడంతో కోర్టుకు వెళ్లి ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం కోర్టులో ఉన్న వివాదాలను పరిష్కరించి ఎన్నికలకు మార్గం సుగమం చేసిందని అంటున్నారు. దీంతో మూడు గ్రామాల ప్రజలు, నాయకులు ఏకతాటిపైకి వచ్చి ఎన్నికలలో ఎవరూ పాల్గొనవద్దని తీర్మానం చేసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా నామినేషన్ కేంద్రం వద్ద రెండు పార్టీల నేతలు కాపలా కాస్తూ ఎవరూ నామినేషన్ వేయకుండా చూస్తున్నారని అంటున్నారు.

ఇప్పుడెలా..

రాష్ట్రంలో అన్ని పట్టణ సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కోర్టుల్లో ఉన్న వివాదాలు అన్నీ పరిష్కరించి ఎన్నికలకు మార్గం సుగమం చేసింది. అయితే స్థానికులకు ఇష్టం లేకుండా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అల్లూరు పట్టణాన్ని ప్రజల కోరిక మేరకు తిరిగి మూడు పంచాయతీలుగా విడగొట్టాలని డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వ పెద్దల ఆలోచన ఏంటో తెలియాల్సిన అవసరం ఉందని అంటున్నారు. స్థానికులు అంతా కలిసి ఎన్నికలు అడ్డుకుంటే ప్రభుత్వ ఆలోచనలో మార్పు రావొచ్చని అంటున్నారు.