Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు సీరియ‌ల్ పారిశ్రామికవేత్త‌: లోకేష్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

విశాఖలో రానాతో పాడ్‌కాస్ట్‌లో మంత్రి నారా లోకేష్ చంద్రబాబు గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. హెరిటేజ్‌కు ముందు మూడు సంస్థలు విఫలమైనా, మరో రంగంలో ప్రయత్నించి విజయం సాధించారని తెలిపారు. వైఫల్యాలకు కుంగిపోకుండా ముందుకు సాగడం యువత నేర్చుకోవాలని సూచించారు. వచ్చే ఫిబ్రవరిలో అమరావతిలో 150 క్యూబిట్ క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు.

By:  Garuda Media   |   14 Nov 2026 1:19 PM IST
చంద్ర‌బాబు సీరియ‌ల్ పారిశ్రామికవేత్త‌: లోకేష్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌
X

ఏపీ సీఎం, త‌న తండ్రి చంద్ర‌బాబు గురించి మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌లో నిర్వ‌హిస్తున్న సీఐఐ స‌ద‌స్సు రెండో రోజు ఆయ‌న‌తో ప్ర‌ముఖ న‌టుడు ద‌గ్గుబాటి రానా ప్యాడ్ కాస్ట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా లోకేష్‌... నూత‌న పారిశ్రామిక వేత్త‌ల గురించి మాట్లాడారు. ఏపీలో యువ‌త‌ను పారిశ్రామిక వేత్త‌లుగా తీర్చిదిద్దుతున్నామ‌న్నారు. యువ‌త ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ఉద్యోగాలు ఇస్తూనే.. మ‌రోవైపు యువ‌తలో పారిశ్రామిక ఏర్పాట్ల‌పై ఆస‌క్తిని పెంచుతున్న‌ట్టు వివ‌రించారు. అదేస‌మయంలో పెట్టుబ‌డుల‌ను కూడా ఆక‌ర్షిస్తున్నామ‌న్నారు.

ఈ క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు గురించి చెబుతూ.. ఆయ‌న `సీరియ‌ల్ పారిశ్రామిక` వేత్త అని వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఏ రంగం బాగుంటే దాని విష‌యం పై అధ్య‌య‌నం చేసి.. ఆ రంగంలో మెరుగైన ఫ‌లితాలు సాధించాల‌ని చూస్తార‌ని అన్నారు. హెరిటే్జ్ సంస్థ‌ను స్థాపించ‌క ముందు.. చంద్ర‌బాబు మూడు సంస్థ‌ల‌ను పెట్టార‌ని, కానీ, వాటి నిర్వ‌హ‌ణ‌లో కొంత తేడా వ‌చ్చి.. అవి స‌క్సెస్ కాలేద‌ని.. ఆ స‌మ‌యంలో కొంత డిప్రెష‌న్‌లోకి వెళ్లినా.. వెంట‌నే కోలుకుని మ‌రో రంగంలో పెట్టుబ‌డుల‌పై ఆస‌క్తి పెంచుకున్నార‌ని చెప్పారు. ఇలానే.. హెరిటేజ్‌ను స‌క్సెస్ చేశార‌ని అన్నారు. ఈ ల‌క్ష‌ణం ప్ర‌స్తుత యువ‌త‌కు అత్యంత అవ‌స‌రమ‌ని చెప్పారు.

ఒక రంగంలో విఫ‌ల‌మైనంత మాత్రాన కుంగిపోకుండా.. మ‌రో రంగంలోకి ప్ర‌వేశించాల‌ని లోకేష్ సూచించారు. ఇక‌, క్వాంటం కంప్యూటింగ్ గురించి ప్ర‌స్తావిస్తూ.. చంద్ర‌బాబు దీనిని ప్ర‌క‌టించే వర‌కు త‌న‌కు కూడా తెలియ‌ద‌ని అన్నారు. వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో అమ‌రావ‌తి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ వ్య‌వ‌స్థ అందుబాటులోకి రానుంద‌ని చెప్పారు. ఇది అనేక దేశాల‌కు సేవ‌లు అందిస్తుంద‌న్నారు. 150 క్యూబిట్ కంప్యూటింగ్ ద్వారా.. ఏపీ ప్ర‌పంచ దేశాల‌కు సేవ‌లు అందించే స్థాయికి చేరుతుంద‌న్నారు. చంద్ర‌బాబు నుంచి నేర్చుకోద‌గిన అనేక విష‌యాల్లో కుంగిపోకుండా ఉండ‌డం.. ధైర్యంగా ముందుకు సాగ‌డం, లోపాల‌ను, అవ‌మానాల‌ను, ఆర్థిక న‌ష్టాల‌ను కూడా అవ‌కాశంగా మార్చుకోవ‌డం వంటివి ముఖ్య‌మని చెప్పారు.