Begin typing your search above and press return to search.

టీడీపీకి భారీ టెండర్ పెట్టనున్న పవన్....?

ఇలా ఒక విధంగా పొలిటికల్ స్టార్ హోదా

By:  Tupaki Desk   |   19 July 2023 10:59 AM GMT
టీడీపీకి భారీ టెండర్ పెట్టనున్న పవన్....?
X

గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో బాగా నలుగుతున్న పేరు పవన్ కళ్యాణ్. ఆయన వారాహి యాత్రతో ఏపీ రాజకీయాలు మారిపోతాయని పవన్ రాజకీయ గురువు హోదాలో మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య చాలా కాలం క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంత కాకపోయినా కొంత వరకూ ఏపీ రాజకీయాలు మాత్రం పవన్ తన వైపు తిప్పుకున్నారు.. ఈలోగా బీజేపీ హై కమాండ్ కూడా ఎన్డీయే భేటీకి పవన్ని పిలిచి పెద్ద పీట వేసింది.

ఇలా ఒక విధంగా పొలిటికల్ స్టార్ హోదా అన్నది పవన్ కి దక్కింది. దాంతో ఆయన ఇపుడు తనపైన మోజున్న తాను మెచ్చిన టీడీపీతో పొత్తుల అడుగులు వేసేందుకు నానా బెట్టు చేసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా వారాహి యాత్ర రెండు విడతలుగా ఉమ్మడి గోదావరి జిల్లాలలో పవన్ నిర్వహించారు. వివాదాల సంగతి పక్కన పెడితే ఈ యాత్రకు అనూహ్యమైన జన స్పందన కనిపించింది.

దీంతో పవన్ తో సహా ఆ పార్టీ శ్రేణులకు ఎక్కడలేని ధీమా వచ్చింది అని అంటున్నారు. పవన్ వారాహి సభలతో ఒక్క సారిగా జనసేన గ్రాఫ్ కూడా పెరిగింది అన్న భావనలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి.ఇక ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా జనసేనకు భారీ ఎత్తున సీట్లు వస్తాయన్న నమ్మకం అయితే జనసేన వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నలభై నుంచి యాభై దాకా ఒక్క జనసేనకే సీట్లు దక్కుతాయని, అందువల్ల 2024లో జనసేనది కింగ్ మేకర్ పాత్ర అని కూడా ఆ పార్టీ నేతలు తలపొస్తున్నారు.

దాంతో ఇపుడు జనసేన చాలా పెద్ద ఎత్తున ఆశలతో ఉందని అంటున్నారు. ఈ పరిణామం నిజంగా టీడీపీని ఇబ్బంది పెట్టేదే అని అంటున్నారు. ఎందుకంటే రేపటి రోజున జనసేనతో పొత్తు కుదుర్చుకోవాలంటే తాము అనుకున్న నంబర్ లో సీట్లు ఇచ్చి వారిని కలుపుకుని పోయే ప్రసక్తి ఉండదు, జనసేన ఆలోచనలు చూస్తే తమకు కచ్చితంగా యాభై సీట్లు ఇచ్చి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తుంది అని అంటున్నారు.

ఒకవేళ గట్టిగా రాయబేరాలు సాగితే ఆ నంబర్ నలభై దగ్గర ఆగవచ్చు అని అంటున్నారు. అంతకు మించి తగ్గేది అయితే జనసేన నుంచి ఉండకపోవచ్చు అని అంటున్నారు. నిజంగా జనసేనకు నలభై సీట్లు అంటే తెలుగుదేశానికి కలవరపెట్టేదే అని అంటున్నారు. ఎందుకంటే అన్ని సీట్లు ఆ పార్టీకి ఇస్తే రేపటి రోజున అంటే చివరి నిముషంలో బీజేపీ జత కట్టినా ఆ పార్టీకి ఒక పాతిక సీటు ఇస్తే అక్కడికే అరవై అయిదు సీట్లు పోతాయి.

ఇక తెలుగుదేశానికి మిగిలింది 110 సీట్లలో పోటీ అని అంటున్నారు. ఇంత తక్కువ సీట్లలో పోటీ చేసి మ్యాజిక్ ఫిగర్ అయిన 88 సీట్లను తెచ్చుకోవడం టీడీపీ కష్టసాధ్యమే అని అంటున్నారు. అంతే కాదు జనసేనకు, బీజేపీకి అన్నేసి సీట్లు ఇచ్చినా వారు సగానికి సగం అయినా గెలుస్తారా అన్నది కూడా చూడాలని అంటున్నారు. అభ్యర్థులు కూడా చూసుకోవాలి.

పైగా ఆ రెండు పార్టీలకు సంస్థాగతంగా పెద్దగా బలం లేనందువల్ల టీడీపీయే ఈ ప్రచార బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా సీట్లూ ప్రచారం వ్యూహాలు అన్నీ ఇచ్చి తామే గెలిపించాల్సి ఉంటుంది. పైగా మిత్రుల నుంచి వచ్చే వత్తిడిని కూడా తట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతచేసినా ఓట్ల షేరింగ్ అన్నది సరిగ్గా లేకపోతే ఈ పొత్తులు పెటాకులు అవుతాయి. అపుడు అంతా వేస్ట్ అవుతుంది.

మరో వైపు వైసీపీ మొత్తం 175 సీట్లకు పోటీ చేస్తుంది. ఆ పార్టీని జనాలు ఆదరించాలనుకుంటే పొత్తు పేరుతో పడిన ఆయాసం అంతా వృధా అనే అంటున్నరు. ఇవన్నీ పక్కన పెడితే వారాహి యాత్ర నుంచి పవన్ లో ఒక రకమైన దూకుడు కనిపిస్తోంది. ఇపుడు ఎన్డీయే మీట్ కి వెళ్లారు. దాంతో ఆయన హవా ఒక స్థాయిలో ఉంటుందని, పొత్తుల పేరిట చర్చలు జరిగినా జనసేన హాఫ్ సెంచరీ సీట్ల వద్ద పీట ముడేసి కూర్చోవడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా టీడీపీకి కలవరం కలిగించే విధంగానే ఉన్నాయని అంటున్నారు.