Begin typing your search above and press return to search.

ఢిల్లీ టూర్ తో పవన్ హ్యాపీనా..నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ఒక్క మాటలో చెప్పాలీ అంటే పవన్ తో పొత్తుని బీజేపీ కోరుకుంటోంది. అలాగే టీడీపీ కోరుకుంటోంది.

By:  Tupaki Desk   |   20 July 2023 12:27 PM GMT
ఢిల్లీ టూర్ తో పవన్ హ్యాపీనా..నెక్స్ట్ స్టెప్ ఏంటి?
X

జనసేన అధినేతకు 2023 జూన్ నుంచి రాజకీయంగా బాగా కలసివచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎపుడైతే వారాహి రధమెక్కి గోదావరి జిల్లాలలో పవన్ కలియతిరిగారో అప్పటి నుంచే ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. పవన్ వివాదాస్పద కామెంట్స్ అయితే చాలానే చేశారు కానీ టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ అయిపోయారు.

ఈలోగా ఢిలీలో బీజేపీ పెద్దలు కూడా ఎన్డీయే మీట్ కి పవన్ కి ఆహ్వానం పంపడం ఆయన తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక పార్టీగా అటెండ్ కావడం చూసుకుంటే పవన్ చుట్టూ ఏపీ పాలిటిక్స్ నడుస్తోందా అన్న చర్చ అయితే వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలీ అంటే పవన్ తో పొత్తుని బీజేపీ కోరుకుంటోంది. అలాగే టీడీపీ కోరుకుంటోంది.

టెక్నికల్ గా చూస్తే పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఆయన మూడు పార్టీలు కలవాలని భావిస్తున్నారు. బీజేపీ మాత్రం పవన్ తోనే పొత్తు అంటోంది. టీడీపీ విషయం తీసుకుంటే నిన్నటిదాకా బీజేపీని కలవరించినా ఇపుడు మారిన ఆలోచనలతో పవన్ ఒక్కరే చాలు అన్నట్లుగా ఉంది. అంటే ఇపుడు ఒక రాధ ఇద్దరు క్రిష్ణుల మాదిరిగా పవనే బీజేపీకీ కావాలీ టీడీపీకి కావాలి.

పవన్ కి రెండు పార్టీలు కావాలని ఉన్నా అవతల పార్టీలకు లేకపోవడం వల్ల అది అయ్యేది కాదు, కానీ పవన్ ఆశావహంగా ఉన్నారు. తాను బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలసి చర్చించారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ ని కలిశారు.

ఇలా బీజేపీ పెద్దలను కలసి ఏపీ రాజకీయం గురించి వారికి పూర్తిగా వివరించారు. వైసీపీని అర్జంటుగా కూల్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అదే టైంలో టీడీపీతో పొత్తు కూడా ఉండాలన్న తన కోరికను బయటపెట్టారని అంటున్నారు. కానీ బీజేపీ ఆలోచనలు వేరుగా ఉన్నాయని అంటున్నారు. టీడీపీతో సంబంధం లేకుండా సొంతంగా ఏపీలో ఎదిగితేనే మంచిది అన్నది ఆ పార్టీ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

టీడీపీకి కొమ్ము కాసి పెద్ద పార్టీగా చేసి అధికారంలో కూర్చోబెడితే అది జాతీయ స్థాయిలో తమకే ఇబ్బంది అవుతుంది అని బీజేపీ భావిస్తోంది. ఇక టీడీపీకి కూడా బీజేపీతో పొత్తు అన్నది ఇపుడు సెకండరీ అయింది అంటున్నారు. బీజేపీకి ఉన్న వ్యతిరేకత తో తాము నిండా మునుగుతామన్న స్పృహ కూడా కొత్తగా వచ్చింది అంటున్నారు.

ఈ నేపధ్యంలో బీజేపీ పొత్తు లేకుంటేనే బెటర్ అన్న ఉద్దేశ్యాలు ఉన్నాయని అంటున్నారు. ఇక జనసేనను మాత్రం అసలు వదులుకోరాదని టీడీపీ భావిస్తోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే అధికారం ఖాయమని కూడా అంచనా కడుతోంది. అలా చూస్తే అటు బీజేపీ ఇటు టీడీపీ రెండూ చెరో వైపున ఉన్నాయి.

మరి పవన్ ఢిల్లీ టూర్ లో బీజేపీ పెద్దలకు చెప్పాల్సింది చెప్పారు. వారు కూడా సావధానంగా విన్నారు. కానీ వారు ఏమి చేయాలని అనుకుంటున్నారో తెలియదు. దాంతో పవన్ ఢిల్లీ టూర్ హ్యాపీగానే సాగిందా గుడ్ రిజల్ట్స్ వస్తాయా అన్నదే చర్చకు వస్తోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ మీద చాలా రకాలుగా ప్రచారం జరిగినా బీజేపీ అనే జాతీయ పార్టీ వ్యూహాలు వేరుగా ఉంటాయి.

అలాగే టీడీపీ ఆలోచనలు కూడా మరో రకంగా ఉంటున్నాయి. ఇప్పటికి చూస్తే రెండు పార్టీలు కలిసే అవకాశాలు తక్కువ. ఇంకో వైపు చూస్తే జనసేనతో టీడీపీ పొత్తుల కధను ముగించి సీట్ల సర్దుబాటు చేసుకుని ముందుకు పోవాలని చూస్తోంది అని అంటున్నారు.

ఎన్నికలకు సమయం దగ్గరగా ఉన్నందువల్ల ఎవరు ఎక్కడ నుంచి పోటీ అని ఒక మాట అనుకుంటే ఆ మీదట గెలుపు మార్గం సులువు అవుతుందని భావిస్తోంది. కానీ పవన్ ఢిల్లీ టూర్ తరువాత మరి కొన్నాళ్ళ పాటు టీడీపీతో పొత్తుల విషయంలో నిర్ణయాన్ని పెండింగులో పెట్టాలని నిర్ణయించుకోవచ్చు అని అంటున్నారు.

బీజేపీ ఈ రోజు కాకపోతే మరి కొంత కాలం తరువాత అయినా తమ దారిలోకి రావచ్చు అన్నది జనసేన అధినాయకత్వం లో కనిపిస్తున్న విశ్వాసం అని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణా ఎన్నికల తరువాత బీజేపీ ఏపీలో పొత్తుల కధను కొత్త మలుపు తిప్పవచ్చు అపుడు 2014 పొత్తుల వ్యవహారం రిపీట్ అవుతుందని కూడా అంచనా కడుతున్నారు.

మొత్తానికి చూస్తే ఢిల్లీ టూర్ విషయంలో పవన్ కొంత ఆశావహంగానే ఉన్నారని అంటున్నారు. తాను చెప్పిన విషయాలు కేంద్ర బీజేపీ పెద్దలు ఆసక్తిగా విన్నారు కాబట్టి ఏపీలో పొత్తులు పండవచ్చు అని ఆయన ధీమాగా ఉన్నారని అంటున్నారు. అయితే టీడీపీకే పొత్తుల విషయంలో తొందర ఆతృత ఉంది. పవన్ తరువాత స్టెప్ ఏంటి అన్న దాని మీదనే టీడీపీ కూడా ఆసక్తిగా చూస్తోంది అని అంటున్నారు. మరి జోగయ్య లేఖ రాయడం వెనక కూడా ఏ రాజకీయం ఉందో అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.