ఏపీలో గత రెండు నెలలుగా వైసీపీ వర్సెస్ జనసేనగా రాజకీయం సాగుతూ వస్తోంది. ఇపుడు అది కాస్తా ముందుకెళ్ళి జగన్ వర్సెస్ పవన్ గా రూపాంతరం చెందుతోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం పవన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు జీవో ఇచ్చింది. ఆయన మీద కోర్టుకు వెళ్తోంది.
ఈ నేపధ్యంలో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నన్ను అరెస్ట్ చేసుకుని జైలులో పెట్టుకోండి అని పవన్ సవాల్ చేస్తున్నారు. నా మీద ప్రభుత్వం విచారణకు రెడీ అవుతోంది. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జనసేన అనుచరులు అభిమానులు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పవన్ పిలుపు ఇచ్చారు.
తనను అరెస్ట్ చేయాలని చూస్తే ప్రభుత్వం పతనం ఆ రోజే మొదలైనట్లు అని కూడా పవన్ గర్జించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు చెప్పాల్సినది అంతా చెప్పాను కేంద్ర పెద్దలతో చర్చలు బాగా జరిగిపోయాయి. ఇక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిపోయింది అని చెబుతూ పవన్ ఆసక్తిని పెంచారు.
మరో వైపు చూస్తే జగన్ సై చూసుకుందామని పవన్ సవాల్ చేయడం సంచలనం రేపుతోంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సౌండ్ ఎక్కడా వినిపించడంలేదు. జగన్ పవన్ ల మధ్యనే రాజకీయం పరచుకున్నట్లుగా పంచుకున్నట్లుగా ఉంది.
ఒక విధంగా వారాహి యాత్రతో పవన్ ఏపీ పొలిటికల్ సెనేరియాలో కంప్లీట్ చేంజి తీసుకుని వచ్చారా అన్నదే చర్చకు వస్తోంది. ఇక వైసీపీ కూడా పవన్ని టార్గెట్ చేస్తోంది. అదే టైం లో కేంద్ర బీజేపీ పెద్దలు సైతం పవన్ని పిలిచి తమ పక్కన కూర్చోబెట్టుకుని ఎన్డీయే మీటింగ్ నిర్వహించారు.
దీన్ని బట్టి చూస్తే ఏపీలో జనసేనను కావాలని పెంచుతున్నారా ఆ గ్రాఫ్ కావాలని ఎక్కువ చేస్తున్నారా ఏపీలో వైసీపీని ఢీ కొట్టే పార్టీగా జనసేనను ముందు ఉంచడంతో వ్యూహం ఏంటి అన్నది చర్చకు వస్తోంది. ఏపీలో టీడీపీ అన్న ఒక ఫార్టీ ఇయర్స్ హిస్టరీ ఉన్న పార్టీ ఉంది.
ఆ పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం కావాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ కేంద్ర పెద్దలతో సన్నిహితంగా మెలగడం, ఏపీలో వైసీపీని దించేది తామే అని గర్జించడం వంటివి చూస్తూంటే ఏమి జరుగుతోంది అన్నదే అందరికీ కలిగే సందేహం. అదే టైం లో జనసేన ఎంత పెరిగితే అంత విపక్ష కూటమికే ఇబ్బంది అని అంటున్నారు. రేపటి రోజున పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగితే మరిన్ని సీట్లు ఎక్కువగా ఆ పార్టీ డిమాండ్ చేసే చాన్స్ ఉంది.
అలా టీడీపీతో పొత్తులో ఉన్నా లేక విడిగా పోటీ చేసినా కూడా ఇబ్బంది పెట్టే విధంగానే వ్యూహాలు రూపొందుతున్నాయని అంటున్నారు. మరో వైపు పవన్ని నిజంగా అరెస్ట్ చేస్తారా చేస్తే ఏపీ రాజకీయం ఎలా ఉంటుంది అనది కూడా చర్చకు వస్తోంది.
పవన్ని అరెస్ట్ చేస్తే కనుక ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద భూకంపమే సంభవించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అలా పవన్ ఇమేజ్ అమాంతం పెంచేసేలా ఈ అరెస్ట్ ఉంటుందా మరి అది వైసీపీ వ్యూహమా లేక మామూలుగానే ఆ పార్టీ జనసేన మీద దాడి చేస్తోందా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.
ఏది ఏమైనా ఏపీ పొలిటికల్ సినేరియోలో టీడీపీ వాయిస్ అయితే ఇపుడు వినిపించడంలేదు. మరి టీడీపీ మౌనంగా ఉండడం ఒక వ్యూహం అనుకున్నా ఇపుడు కనుక సౌండ్ చేయకపోతే జనసేన తనదైన దూకుడుతో ముందుకు దూసుకుని వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని అంటున్నారు. అలా మూడవ ప్లేస్ లో ఉన్న పార్టీ క్రమంగా ముందుకు వస్తే కనుక అది టీడీపీ ఎపుడైనా దెబ్బే అంటున్నారు.