Begin typing your search above and press return to search.

రాజమండ్రి మరో అనంతపురం అవుతుందా? ఆసక్తికరంగా కార్పొరేషన్ పోరు

రాజమండ్రి నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థి ఎంపిక కూటమిలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. బీజేపీ తరఫున మాజీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి పేరు వినిపిస్తుండగా, టీడీపీ నేతలు డాక్టర్ పిడుగు విజయకుమార్ పేరును ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ నుంచి మాజీ కార్పొరేషన్ ఉద్యోగి బర్రె కొండబాబు పేరు తెరపైకి వచ్చింది. కూటమిలో అభ్యర్థి ఎంపికపై భిన్నాభిప్రాయాలు తమకు కలిసొస్తాయని వైసీపీ భావిస్తోంది. ఈ నెల 26న జరగనున్న ఎన్నిక నేపథ్యంలో రాజమండ్రి రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 Nov 2026 2:00 PM IST
రాజమండ్రి మరో అనంతపురం అవుతుందా? ఆసక్తికరంగా కార్పొరేషన్ పోరు
X

రాజమండ్రి నగర పాలక సంస్థ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఎస్సీ జనరల్ కేటగిరీకి రిజర్వు చేసిన ఈ స్థానం నుంచి అధికార, ప్రతిపక్షాలు నువ్వానేనా అన్నట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. కూటమి తరపున బీజేపీ మేయరు రేసులో నిలబడుతోందని అంటున్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి పేరు దాదాపు ఖరారైందని అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ తరఫున కార్పొరేషన్ మాజీ ఉద్యోగి బర్రె కొండబాబు పేరు ప్రచారంలో ఉంది. అయితే బీజేపీ అభ్యర్థి శ్రీదేవి పేరు పట్ల కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన టీడీపీ సానుకూలంగా లేదన్న టాక్ ఎక్కువగా ఉంది. ఆమెకు బదులుగా డాక్టర్ పిడుగు విజయకుమార్ పేరును సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సిఫార్సు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో కూటమిలో అభ్యర్థి ఎంపికపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నిక రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలో రెండో విడత మున్సిపల్ సంగ్రామానికి తెర లేచింది. ఈ నెల 26న నాలుగు కార్పొరేషన్‌లతోపాటు 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో రెండు చోట్ల జనసేన, ఒక చోట టీడీపీ, మరోచోట బీజేపీ పోటీకి దిగుతున్నాయి. శ్రీకాకుళం, కాకినాడ కార్పొరేషన్లు జనసేన, మంగళగిరి-తాడేపల్లి నుంచి టీడీపీ పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. రాజమండ్రిపై బీజేపీ ఎప్పుడో కర్చీఫ్ వేసింది. కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ కార్పొరేషన్ దక్కించుకోవాలని ఎప్పటి నుంచో బీజేపీ పావులు కదుపుతోంది. అయితే ఆ పార్టీకి సంస్థాగతంగా పెద్దగా బలం లేదన్న ఆలోచనతో విపక్షం ఈ స్థానంపై గట్టిగా ఫోకస్ చేసింది. ఇదే సమయంలో అభ్యర్థి ఎంపికలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే ప్రచారంతో వైసీపీలో ఆశలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

నాలుగు కార్పొరేషన్లలో రాజమండ్రి తప్ప మరెక్కడా అభ్యర్థుల ఎంపికపై భిన్నాభిప్రాయాలు లేవని చెబుతున్నారు. మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్ లో కూటమి బలంగా ఉందన్న ప్రచారం ఎక్కువగా ఉంది. అదే సమయంలో కాకినాడలో కూడా జనసేన, టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉన్నారని చెబుతున్నారు. దీంతో ఈ రెండు కార్పొరేషన్లపై కూటమి ప్రత్యర్థులు పెద్దగా ఫోకస్ చేయడం లేదని అంటున్నారు. అదే సమయంలో శ్రీకాకుళంలో కూటమిలో విభేదాల కారణంగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైసీపీలో చేరడం, ఆమె మేయరుగా పోటీకి దిగుతుండటంతో అక్కడ ఎన్నిక రసవత్తరంగా మారిందని చెబుతున్నారు. మరోవైపు రాజమండ్రిలో కూడా అనంతపురం కార్పొరేషన్ తరహా రాజకీయాలు నెలకొనడంతో వైసీపీలో ఆశలు పురుడుపోసుకుంటున్నాయి.

అనంత కార్పొరేషన్లో టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం లోపించడంతో కేవలం 6 వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. ఆ కార్పొరేషన్ లో బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడం కూడా వైసీపీకి అడ్వాంటేజ్ అయిందని అంటున్నారు. ఇక రాజమహేంద్రవరంలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, సంస్థాగత బలం విషయంలో తామే మెరుగ్గా ఉన్నామన్న ఆలోచన వైసీపీకి ఆశలు పెంచుతోందని అంటున్నారు. దీంతో కార్పొరేషన్ లో సుదీర్ఘకాలం ఉద్యోగిగా పనిచేసిన కొండబాబు పేరును వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారని అంటున్నారు. పారిశుధ్యం, వాటర్ వర్స్కు డిపార్టుమెంటులో పనిచేసిన కొండబాబు నగర ప్రజలకు సుపరిచితుడిగా పేర్కొంటున్నారు. దీనివల్ల తమకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నేతలలో జోష్ కనిపిస్తోందని చెబుతున్నారు. మొత్తానికి బీజేపీకి కేటాయించిన ఈ స్థానాన్ని ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వైసీపీ పావులు కదుపుతోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీపై పైచేయి సాధించడానికి కూటమి నేతలు ఎలాంటి వ్యూహాలు రచిస్తారనేది ఆసక్తి రేపుతోంది.