జగన్ లాంటి మనస్తత్వం ఎవరికి లేదు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
జగన్ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. షర్మిల తన ఇంటికి శుభలేఖ ఇవ్వడంపై జగన్ సొంత పత్రికలో వక్రభాష్యాలతో కథనాలు రాయించారని ఆరోపించారు. గతంలో వైఎస్సార్‌తో రాజకీయ విభేదాలున్నా వ్యక్తిగత సంబంధాలు కొనసాగాయని గుర్తుచేసుకున్నారు. 2028 నాటికి 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్న తాను, జగన్ లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.
By: Tupaki Political Desk | 22 Nov 2026 4:54 PM ISTమాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ తీరు, వ్యవహార శైలి తనను తీవ్ర ఆందోళనకు గురి చేశాయని వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల క్రితం ఒక రాత్రి జగన్ గురించి తాను ప్రత్యేకంగా ఆలోచించాల్సి వచ్చిందని వెల్లడించారు. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులతో సైద్ధాంతిక పోరాటమే తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ పట్టించుకోనని, కానీ జగన్ మనస్తత్వం చూసి మాత్రం ‘‘అసలు ఏంటీ మనిషి.. ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి’’ అని ఆలోచించానని చంద్రబాబు వెల్లడించారు.
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ఇంటికి వచ్చి శుభలేఖ అందించిన అంశాన్ని జగన్ సొంత పత్రికలో ప్రచురించిన తీరుపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. తోడబుట్టిన చెల్లెలు, పైగా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తమ ఇంటికి వచ్చి ఆహ్వాన పత్రిక ఇస్తే, దానికి వక్రభాష్యాలు చెబుతూ పత్రికలో కథనాలు రాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ పత్రిక కథనాన్ని మీడియా ప్రతినిధులకు చూపిస్తూ, ఎంతసేపూ వ్యక్తిగత విషయాలను, అపార్థాలను నెత్తికి చుట్టుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అసలు ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు కూడా వస్తాయా అని తనకు అనిపించిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్న రోజులను కూడా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు అసెంబ్లీ వేదికగా తన సతీమణిని ఉద్దేశించి అనరాని మాటలు అన్నారని, ఆ ఘటనతో తాను తీవ్ర మనోవేదనకు గురై కన్నీళ్లు ఆపుకోలేకపోయానని చెప్పారు. రాజకీయాల్లో పోటీ ఉండొచ్చు కానీ, ఈ స్థాయిలో వ్యక్తిగత అంశాలను లాగడం, లేనిపోని సంబంధాలు అంటగడుతూ ఇష్టమొచ్చినట్లు రాయించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచనా విధానం సక్రమంగా ఉండాలని హితవు పలికారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని, నాటి రాజకీయ సంప్రదాయాలను చంద్రబాబు ఈ సందర్భంలో ప్రస్తావించారు. తాను, వైఎస్ఆర్ ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించామని, కొంతకాలం కాంగ్రెస్‌లో కలిసి పని చేశామని, ఆ తర్వాత ఎవరికి నచ్చిన దారిని వారు ఎంచుకున్నామని గుర్తు చేశారు. వేర్వేరు పార్టీల్లో ఉండి అసెంబ్లీలో ఘాటుగా విమర్శించుకున్నా, సభ బయటకు వచ్చాక నవ్వుతూ కలిసి కాఫీ తాగిన రోజులు ఉన్నాయని, అప్పట్లో ఎప్పుడూ వెకిలి రాజకీయాలు చేయలేదని తెలిపారు. తిరుపతిలో తనపై మావోయిస్టులు దాడి చేసినప్పుడు వైఎస్ఆర్ హైదరాబాద్ నుంచి పరుగుపరుగున వచ్చి పరామర్శించారని, అలాగే హైదరాబాద్‌లో జరిగిన షర్మిల వివాహానికి వైఎస్ఆర్ ఆహ్వానిస్తే తాను వెళ్లానని గుర్తు చేసుకుంటూ, అది తమ మధ్య ఉన్న అనుబంధమని వివరించారు.
వచ్చే 2028 నాటికి తాను 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నానని చంద్రబాబు తెలిపారు. ఈ అర్ధ శతాబ్దపు ప్రయాణంలో ఎంతో మంది నేతలను చూశాను, ఎందరితోనో రాజకీయంగా పోరాడాను కానీ, జగన్ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని మాత్రం ఎప్పుడూ చూడలేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యవహార శైలి, మనస్తత్వం ఉన్న వారిని ఏం చేయాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు
