3 గంటల 22 నిమిషాలు.. రికార్డు బ్రేక్ చేసిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు తన సుదీర్ఘ మీడియా ప్రసంగం రికార్డును తానే బద్దలుకొట్టారు. గతంలో 2 గంటల 40 నిమిషాలు మాట్లాడిన ఆయన, తాజాగా ఏకంగా 3 గంటల 22 నిమిషాల పాటు మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు, వైసీపీ, పెట్టుబడులు, కేంద్రంతో సంబంధాలు, టీడీపీ అంతర్గత విభేదాలు సహా పలు అంశాలపై వివరించారు.
By: Garuda Media | 21 Nov 2026 11:09 PM ISTఏపీ సీఎం చంద్రబాబు తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నారు. ఏకధాటిగా మీడియా ముందు మాట్లాడిన రికార్డు ఇప్పటి వరకు చంద్రబాబుకు మాత్రమే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుదీర్ఘంగా మీడియాముందు.. మాట్లాడిన నాయకుడిగా చంద్రబాబు రికార్డు సృస్టించారు. గత ఏడాది ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియా ముందు మాట్లాడారు. అప్పట్లో తిరుమల లడ్డూ, రప్పా రప్పా, వైసీపీ పోకడలు, జగన్ యాత్రలు ఇలా.. పలు అంశాలను ప్రస్తావించారు.
తాజాగా మరోసారి ఆయన శనివారం మీడియా ముందుకు వచ్చారు.ఈ సందర్భంగా తాను ఏర్పరుచుకున్న రికార్డును తానే తిరగరాసినట్టు అయింది. ఏకంగా 3 గంటల 22 నిమిషాల పాటు ఏకధాటిగా చంద్రబాబు మాట్లాడారు. ఈ క్రమంలో స్థానిక నుంచి జడ్పీ , మండల పరిషత్ ఎన్నికలు, వైసీపీ ఎన్నికల వ్యవహారం, జగన్ మీడియా అవలంభిస్తున్న తీరు, వైఎస్ రాజశేఖరెడ్డితో తన కు ఉన్న అనుబంధం.. వచ్చే 2028 నాటికి ప్రజా జీవితంలో తనకు 50 ఏళ్లు నిండనున్నాయన్న అంశంతో పాటు.. పెట్టుబడుల విషయాన్ని కూడా ప్రస్తావించారు. -
అలానే, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, తమిళనాడు పరిశ్రమలను ఏపీ లాగేసుకుంటోందన్న వివాదంపైనా ఆయన స్పందించారు. ఇక, టీడీపీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఇలా.. అనేక అంశాలను ప్రస్తావిస్తూ.. టీడీపీకి స్థానిక ఎన్నికల్లో జరిగిన అవమానం గురించి.. అరకు, పాడేరు.. వంటి స్థానాలు ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందన్న అంశాలను కూడా చెప్పారు. ఇలా.. మొత్తం 3 గంటల 22 నిమిషాలు ఆయన ప్రసంగం సాగింది.
ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ``చాలా ఎక్కువ సేపు మాట్లాడాను. నా రికార్డును నేనే బ్రేక్ చేస్తున్నానా?`` అని మీడియాను ఆయన సరదాగా ప్రశ్నించారు. అనంతరం కూడా.. మీడియా మిత్రులు అడిగిన సందేహాలకు సమాధానం చెప్పారు. ఇంత సుదీర్ఘ ప్రసంగంలోనూ ఎక్కడా గ్లాసు మంచి నీళ్లు కూడా తాగకపోవడం.. ఎక్కడా తడబడక పోవడం గమనార్హం. అంతేకాదు.. ప్రతి విషయాన్నీ చాలా కూలంకషంగా చంద్రబాబు వివరించారు. మొత్తానికి ఆయన మీడియా ప్రసంగం తొలిసారి ఒక సినిమా కంటే ఎక్కువ సమయం తీసుకోవడం గమనార్హం.
