దక్షిణాదిని ఒప్పిస్తారా 'బాబూ' .. ?
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను తొలగించే బాధ్యత చంద్రబాబుపై పడినట్లు చర్చ జరుగుతోంది. ఈ బిల్లులతో దక్షిణాదికి నష్టం ఉండదని ఆయన చెబుతున్నా, మూడు అంశాలపై స్పష్టత అవసరం. రాష్ట్రాల వారీగా సీట్ల పెంపు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, జనాభా లెక్కల ఆధారంగా స్థానాల కేటాయింపుపై బిల్లులో మార్పులు చేశారా లేదా అన్నదే కీలకం.
By: Garuda Media | 28 Nov 2026 7:15 PM ISTపార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం తక్కువగానే ఉన్నా.. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళ నాడు, కేరళ వంటివి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణ చేసిన తమకు ప్రస్తుతం నియోజ కవర్గాల పునర్విభజన అంశం ఇబ్బందిగా మారుతుందని చెబుతున్నాయి. సంఖ్యాపరంగా తమకు సమస్య వస్తుం ద ని, ప్రాతినిధ్యం తగ్గుతుందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో గత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు వీగిపోయింది.
ఇదిలావుంటే.. ప్రస్తుతం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో అనూహ్యంగా టీడీపీ అధినేత, కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించారు. పైకి చెప్పకపోయినా.. ఈ బిల్లుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతలను దాదాపుగా ఆయనపైనే పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే.. తన ఢిల్లీ మీడియా సమావేశంలో చంద్రబాబు పదే పదే దక్షిణాది రాష్ట్రాల విషయాన్ని ప్రస్తావించారు.
దక్షిణాది రాష్ట్రాలకు ఈ బిల్లుల కారణంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు చెబుతున్నారు. అంతేకాదు.. అసలు ఈ బిల్లుల కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు మరింత మేలు కూడా జరుగుతుందని అంటున్నారు. అయితే.. ఆయన చెప్పినంత తేలికగా.. ఆయా రాష్ట్రాల్లోని పార్టీలు, అధికార పక్షాలు అంగీకరిస్తారా? సమ్మతిస్తాయా? అనేది ప్రశ్న. కానీ, చంద్రబాబు చెబుతున్న విషయం ఎలా ఉన్నప్పటికీ.. గతంలో ఉన్న బిల్లును.. ప్రస్తుతం తీసుకురానున్న బిల్లును తరచి చూస్తే.. కొంత తేడా కనిపిస్తోంది. ఈదిశగానే చంద్రబాబు ప్రయత్నాలు చేయాలి.
గత బిల్లులో ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం మేరకు పార్లమెంటు స్థానాలను పెంచుతామని ఎక్కడా చెప్పలేదు. ముందు బిల్లుకు ఓటేయండి తర్వాత చేరుస్తాం.. అన్నారు. ఇప్పుడు దీనిని సవరించారా? లేదా? అనేది రేపు బిల్లు వచ్చే వరకు తెలియదు. అలానే.. పెరుగుతున్న పార్లమెంటు స్థానాల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని.. గత బిల్లులో పేర్కొన్నారు. దీనికి విపక్షాలు అడ్డు చెప్పాయి. ఇప్పటికే ఉన్న వాటితో కలిపి అంటే 543 స్థానాలతో కలిపి అన్నింటా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు. మరో కీలక విషయం.. జనాభా లెక్క. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. ఉత్తరాది రాష్ట్రాలకు పెరుగుతాయి. బిల్లులో అంతర్లీనంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు. దీనిని ఇప్పుడు తీసేశారా? లేదా? అనేది కీలకం. ఈ మూడు అంశాలపైనే చంద్రబాబు ఒప్పించ గలిగితే.. ఆయన ఈ విషయంలో సక్సెస్ అవుతారు.
