Begin typing your search above and press return to search.

బిగ్ నంబర్ తో బీజేపీ..జనసేన టెంప్ట్ అవుతుందా..?

మొత్తం ఏపీలోని 175 సీట్లలో కేవలం పాతిక సీట్లను మాత్రమే బీజేపీ పొత్తులో భాగంగా తీసుకుని 150 సీట్లను జనసేనకు వదిలేయాలని నిర్ణయించుకుందని మరో గాసిప్ ప్రచారంలో ఉంది.

By:  Tupaki Desk   |   21 July 2023 3:42 PM GMT
బిగ్ నంబర్ తో బీజేపీ..జనసేన టెంప్ట్ అవుతుందా..?
X

ఏపీలో త్రిముఖ పోరు సాగుతున్నా లేక కూటములతో వస్తారా అన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం బట్టే ఆధారపడి ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇపుడు టెక్నికల్ గా చూస్తే బీజేపీ పొత్తులో ఉన్నారు. మరో వైపు ఆయన టీడీపీ తో కూడా చెలిమిని వదులుకోలేని విధంగా ఉన్నారు.

ఇక దేశమంతా బీజేపీ బలంగా ఉన్నా ఏపీ వరకూ చూసుకుంటే కేవలం ఒక్క శాతం మాత్రమే ఓటింగ్ ఉన్న పార్టీ అది. మరో వైపు నలభై శాతం ఓటింగ్ ఉన్న పార్టీ టీడీపీ ఆ పార్టీతో జనసేన చేతులు కలిపితే అధికారంలోకి రావడమే కాకుండా తమ సీట్లను గెలుచుకోవచ్చు అన్న ధీమా కూడా ఉంది.

ఇదిలా ఉంటే ఒక గాసిప్ ప్రచారంలో ఉంది. దాన్ని బట్టి చూస్తే టీడీపీని పవన్ కళ్యాణ్ తన పార్టీ కోసం యాభై సీట్ల దాకా డిమాండ్ చేశారని, అది కాస్తా ముప్పయి అయిదు సీట్లకు ఖరారు అయింది అని అంటున్నారు. ఈ మేరకు ఒక ఒప్పందం కుదిరింది అని అంటున్నారు.

మరో వైపు బీజేపీ అయితే ఏపీలో జనసేనతోనే పొత్తు అంటోంది. అదే సమయంలో పవన్ సీఎం అని కూడా చెబుతోంది. మొత్తం ఏపీలోని 175 సీట్లలో కేవలం పాతిక సీట్లను మాత్రమే బీజేపీ పొత్తులో భాగంగా తీసుకుని 150 సీట్లను జనసేనకు వదిలేయాలని నిర్ణయించుకుందని మరో గాసిప్ ప్రచారంలో ఉంది.

దాన్ని బట్టి చూస్తే పవన్ జనసేనకు ఇది బంపర్ ఆఫర్ గానే భావించాలి. 150 సీట్లలో పోటీ అంటే 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 137 సీట్ల కంటే కూడా ఎక్కువ అని అంటున్నారు. ఇక జనసేన బీజేపీ కలిస్తే జనాలకు ఈ కూటమి ఆదరణ దక్కితే సీఎం గా పవన్ ఉండవచ్చు.

కానీ ఇది అంత సులువుగా జరిగే విషయం కాదని అంటున్నారు. ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంక్ పెద్దగా లేదు. మరో వైపు జనసేన బీజేపీతో కూడితే ఆ రెండు పార్టీలు బలమైన వైసీపీ టీడీపీలను ఎదుర్కొని ముందుకు సాగుతాయా అన్న చర్చ కూడా ఉంది.

ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీతో ఒప్పందం మేరకు ఉభయ గోదావరి జిల్లాలలో ఇరవై సీట్ల దాకా జనసేన తీసుకుని ఉత్తరాంధ్రాలో అయిదు, కోస్తా జిల్లాలలో మరో అయిదు, రాయలసీమలో అయిదు సీట్లను పొత్తులో భాగంగా దక్కించుకుంటుందని ప్రచారంలో ఉన్న మాట.

ఈ సీట్లను టీడీపీతో కలసి గెలుచుకోవడం ద్వారా వచ్చే అసెంబ్లీలో అడుగుపెట్టడానికి మంచి నంబర్ తన వెంట ఉంటుందని జనసేన అనుకోవచ్చు. అయితే బీజేపీ కూడా బిగ్ నంబర్ తో ఆఫర్ ఇస్తోంది. పైగా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటామని అంటోంది.

దాంతో తేల్చుకోవడం అన్నది ఇపుడు పవన్ కళ్యాణ్ మీదనే ఉంది అని అంటున్నారు. అయితే బీజేపీ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది అని అంటున్నారు. జనసేనను తమ వైపు తిప్పుకుంటే త్రిముఖ పోరు ఏపీలో జరిగి టీడీపీ దెబ్బ తింటుందని, ఆ ప్లేస్ లోకి బీజేపీ రావచ్చు అన్నదే ఎత్తుగడగా ఉంది అని అంటున్నారు.

ఇక త్రిముఖ పోరు జరిగితే వైసీపీకి అడ్వాంటేజ్ గా ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి పవన్ బీజేపీ ఆఫర్ కి టెంప్ట్ అవుతారా లేక టీడీపీతో చేరి సేఫ్ గేమ్ ఆడతారా అన్నదే చూడాలని అంటున్నారు. మొత్తం మీద ఇదంతా గాసిప్ గా ప్రచారంలో ఉన్న విషయం అయినా రాజకీయ అంశం కాబట్టి ఆసక్తిని పెంచుతోంది.