వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వైసీపీలో కీలక మార్పులు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. జగన్ సతీమణి భారతీరెడ్డికి పార్టీ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్రకు వెళ్లనున్న నేపథ్యంలో పార్టీ రోజువారీ వ్యవహారాలను ఆమె పర్యవేక్షించనున్నారని సమాచారం. ఎన్నికల వ్యూహకర్తగా కపిల్ సాహును నియమించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 20 Nov 2026 10:55 PM ISTవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి పార్టీని అన్ని విధాలా సమాయత్తం చేయడానికి వివిధ దశల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిలో అన్నిటికంటే ప్రధానంగా మాజీ సీఎం, పార్టీ అధినేత జగన్ సతీమణి భారతీరెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించనున్నారనే ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది. ఇదేసమయంలో పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా కపిల్ సాహును నియామక ప్రక్రియ పూర్తిచేసినట్లుగా చెబుతున్నారు. కపిల్ సాహు ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే తరఫున పనిచేశారు. ఆ పార్టీ విజయానికి వ్యూహరచన చేశారని అంటున్నారు.
రంగంలోకి భారతీరెడ్డి
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విపక్షం వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు. అధినేత జగన్ రెడ్డి వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. రెండేళ్లపాటు అంటే ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు వరకు ఆయన ప్రజల మధ్యే ఉండనున్నారని చెబుతున్నారు. దీంతో పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలతోపాటు దైనందన కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను జగన్ సతీమణి భారతీరెడ్డికి అప్పగించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు కుటుంబ వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించిన భారతీరెడ్డి ఇకపై పూర్తిగా రాజకీయ కార్యక్రమాల బాధ్యతలు తీసుకోనున్నారని అంటున్నారు. దీనిపై ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని, భారతీరెడ్డి కూడా తన బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని చెబుతున్నారు.
సజ్జల, వైవీ స్థానంలో భారతీరెడ్డి
ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణిగా మరో మాజీ ముఖ్యమంత్రి కోడలిగా భారతీరెడ్డికి రాజకీయాలతో చాలా కాలం నుంచే సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆమె ఎన్నడూ నేరుగా రాజకీయ కార్యక్రమాలలో కనిపించలేదు. భర్త తరఫున పులివెందులలో ఎన్నికల సమయంలో ప్రచార బాధ్యతలు మాత్రమే చూసుకునేవారని అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా భారతీరెడ్డి పూర్తిగా పార్టీ బాధ్యతలు భుజానకు ఎత్తుకోవాల్సివస్తోందని అంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, తన చిన మామ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వంటివారు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ వారి స్థాయిలో సాధ్యం కాని నిర్ణయాల కోసమే భారతీరెడ్డిని తెరముందుకు తీసుకువస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సజ్జల, వైవీ సుబ్బారెడ్డి ఇక నుంచి భారతీరెడ్డికి సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
టీం భారతీరెడ్డి
ఇక పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించక తప్పదు అనే నిర్ణయం తీసుకున్న తర్వాత భారతీరెడ్డి తన బృందాన్ని రెడీ చేసుకున్నారని చెబుతున్నారు. పార్టీ ప్రచార కార్యక్రమాలు, ఇతర వ్యూహాత్మక నిర్ణయాలలో కపిల్ సాహు బృందం సహాయం చేయనుండగా, పార్టీ తరఫున కూడా ఒక జట్టును సిద్ధం చేశారని చెబుతున్నారు. ఈ బృందం పార్టీ నేతలకు భారతీరెడ్డికి మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ చూస్తుందని చెబుతున్నారు. మాజీ సీపీఆర్వో శ్రీహరి ఆధ్వర్యంలో కొద్దిమంది సీనియర్ జర్నలిస్టులతో భారతీ రెడ్డి టీం తయారైందని చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది సాక్షి మీడియా గ్రూపునకు చెందిన వారేనని అంటున్నారు. అదేవిధంగా వైసీపీ అనుకూల మీడియాలో పనిచేసిన జర్నలిస్టులకు సైతం పార్టీ బాధ్యతలలోకి తీసుకోవాలని భారతిరెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు.
