Begin typing your search above and press return to search.

10 రోజుల ఉత్కంఠ.. 19న జడ్పీ, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక

ఏపీలో జడ్పీ, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19న జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. ఆరోజు సాధ్యం కాకపోతే 20న నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 28 జడ్పీల్లో 27 కూటమికి, ఒకటి వైసీపీకి దక్కే అవకాశం ఉండటంతో పదవుల కోసం పోటీ నెలకొంది.

By:  Tupaki Desk   |   10 Nov 2026 3:06 PM IST
10 రోజుల ఉత్కంఠ.. 19న జడ్పీ, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక
X

జడ్పీ, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19న జడ్పీ, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించాలని సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. 19న ఎన్నిక జరగకుంటే ఆ మరునాడు 20వ తేదీన ఎన్నిక నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 10వ తేదీ (మంగళవారం) షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీలు ఎంపీపీలను, జడ్పీటీసీ అభ్యర్థులు జడ్పీ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు ఈ నెల 7న విడుదలైన విషయం తెలిసిందే. మూడు రోజులుగా జడ్పీ చైర్మన్, మండల అధ్యక్షుల ఎవరు అవుతారనే చర్చ ఎక్కడిక్కడ జరుగుతోంది. ఇప్పుడు మరో పది రోజుల సమయం ఉండటంతో ఆశావహుల సంఖ్య పెరగడంతోపాటు అధిష్టానానికి తలనొప్పులు తప్పవని అభిప్రాయపడుతున్నారు.

ఈ నెల 19న జడ్పీ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షులను ఎన్నుకోవడంతోపాటు అదే రోజు ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. 19న తప్పితే 20న ఎన్నిక నిర్వహించాల్సివుంటుంది. అదేవిధంగా మండల పరిషత్ లో ఒకరు, జిల్లా పరిషత్తులో ఇద్దరు చొప్పున కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. మతం, భాషాపరమైన మైనార్టీలకు కో-ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేయాలని సూచించింది. సహజంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన రెండు మూడు రోజులకే మండలాధ్యక్షులు, జడ్పీ చైర్మన్లను ఎన్నుకుంటారు. అయితే ఈ సారి దాదాపు రెండు వారాల సమయం ఇస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది.

ఇప్పటికే ఫలితాలు వచ్చి మూడు రోజులు అవుతుండగా, మరో పది రోజుల సమయం ఇవ్వడం వల్ల రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 28 జడ్పీలు ఉండగా, 27 జడ్పీలు కూటమికి దక్కే అవకాశం ఉంది. అల్లూరి జిల్లా పీఠం మాత్రం వైసీపీకి దక్కనుంది. ఈ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అంటున్నారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై ఆయా పార్టీల అగ్రనాయకత్వాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఎస్ఈసీ నిర్ణయం వల్ల పది రోజుల సమయం ఉండటంతో అన్నిరకాలుగా ఆలోచించిన తర్వాతే అభ్యర్థులపై ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.

బరిలో బడా నేతలు

ఎంపీటీసీలుగా గెలిచిన వారిలో ఒకరిని మండలాధ్యక్షులుగా, జడ్పీటీసీల్లో గెలిచిన వారిలో ఒకరిని జడ్పీ చైర్మనుగా ఎన్నుకుంటారు. పరోక్ష విధానంలో జరిగే ఈ ఎన్నికపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. 27 జిల్లాల్లో కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో చైర్మన్లు, మండలాధ్యక్షుల ఎన్నిక లాంఛనంగానే చెబుతున్నారు. అయితే కొన్నిచోట్ల రెండు పార్టీలకు సమానంగా ఎంపీటీసీ స్థానాలు రావడం, తేడా తక్కువగా ఉండటం వల్ల ఆయా స్థానాల కోసం భారీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఆయా స్థానాలను సొంతం చేసుకోడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ఆయా మండలాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇలా రాష్ట్రంలో సుమారు 30 మండలాల వరకు ఇరు పార్టీల మధ్య పోటీ ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పది రోజుల సమయం దొరకడం అధికార పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.