టీడీపీ నుంచి బీజేపీలోకి.. మళ్లీ టీడీపీలోకి.. అన్నంవారి పాట్లు
మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు బాపట్ల రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. గతంలో బీజేపీలో చేరిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయడం ఈ ఊహాగానాలకు బలమిచ్చింది. ఆయన చేరికపై మంత్రి నారా లోకేష్ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
By: Garuda Media | 29 Nov 2026 1:00 AM ISTమాజీ ఎమ్మెల్సీ.. బాపట్ల జిల్లాకు చెందిన అన్నం సతీష్ ప్రభాకర్ రూటు మార్చుతున్నారా? ఆయన తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. వాస్తవానికి టీడీపీతోనే రాజకీయ అరంగేట్రం చేసిన అన్నం.. 2014, 2019 అసెంబ్లీ ఎన్నిక్లలో బాపట్ల టికెట్ కూడా దక్కించుకున్నారు. అయితే.. స్వల్ప తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు. అనంతరం.. ఆయనకు వ్యాపార భాగస్వామిగా ఉన్న ఓ కీలక నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఓ నేతతో కలిసి.. బీజేపీ పంచన చేరిపోయారు.
వాస్తవానికి ఆ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు వద్దని వారించారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కానీ, అన్నం మాత్రం దూకుడుగా బీజేపీ కండువా కప్పుకొన్నారు. కానీ ఆయనకు వ్యక్తిగతంగా ఇమేజ్ లేకపోవడం.. బీజేపీ బాపట్ల పరిధిలో పుంజుకోకపోవడంతో దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. టీడీపీ పుంజుకోవడం.. మరోసారి కూడా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో అన్నవారు రూటు మార్చుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అన్నం ప్రభాకర్.. టీడీపీ అనుకూల ప్రచారం చేయడంపార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. నిజానికి గత కొంతకాలంగా ఆయన బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా కూడా చేశానని ప్రకటించారు. కానీ, దీనిపై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ పరంగా అన్నంకు ప్రాధాన్యం లేకుండా పోవడం.. కీలక నాయకులు ఎవరూ ఆయనను బలపరచకపోవడం వంటివి అన్నంకు కమలం పార్టీలో కలకలం రేపేలా చేస్తున్నాయని అంటున్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు.
ఇక, ఇప్పుడు అన్నం చూపు మరోసారిటీడీపీ వైపు పడిందని చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేగేశ్న నరేంద్ర వర్మ.. అన్నంను పార్టీలోకి తీసుకునే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది. అన్నంను పార్టీలోకి తీసుకువచ్చే చర్యలపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. కానీ, బలమైన ఓ నేత మద్దతుతో అన్నం తెరచాటు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విషయం మంత్రి నారా లోకేష్ వరకు వెళ్లిందని చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే నిర్ణయం ఉంటుందని అంటున్నారు.
