దేశంలోనే తొలిసారి...వాళ్లకు రక్షణగా కూటమి చట్టం
ఏపీలో పెట్టుబడిదారులకు భరోసా కల్పించేలా చంద్రబాబు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దేశంలోనే తొలిసారిగా ప్రతిపాదిస్తున్న ఈ పెట్టుబడుల పరిరక్షణ బిల్లును డిసెంబర్ 5 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారినా గతంలో కుదుర్చుకున్న పారిశ్రామిక ఒప్పందాలు, భూములు, రాయితీలకు రక్షణ కల్పించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.
By: Satya P | 25 Nov 2026 8:00 PM ISTఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సరి కొత్త చట్టాన్ని తీసుకుని వస్తోంది. ఇది దేశంలోనే తొలిసారి. ఇలాంటి చట్టం ఒకటి చేయాలన్న ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచన చేసింది. దీంతో రాష్ట్ర ప్రగతి ముడిపడి ఉండడం విశేషం. ఎందుకంటే ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఆయా ప్రాజెక్టులు గ్రౌండ్ అయి ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుంది. ఈలోగా ప్రభుత్వం మారితే ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ప్రభుత్వ నిర్ణయాలకు స్థిరత్వం ఉండాలి. ఎక్కడైనా పెట్టుబడిదారులు ఇదే కోరుకుంటారు. ఇక దేశంలో చూస్తే వివిధ రాష్ట్రాల్లో గత ప్రభుత్వ విధానాలను ముఖ్యంగా రాష్ట్ర ప్రగతికి సంబంధించి కొనసాగించేందుకు చూస్తున్నారు. ఏపీలో మాత్రం పునస్సమీక్షకు గురి అవుతున్నాయి. అందుకే పెట్టుబడిదారులకు రక్షణ కవచంగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం చట్టం తీసుకుని వస్తోంది.
కొత్త ఆలోచనగా :
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన పెట్టుబడుల పరిరక్షణ చట్టం దేశంలోనే మొట్టమొదటిదిగా చెబుతున్నారు. ఇటీవలనే విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక డిసెంబర్ లో జరిగే ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో ఈ చట్టం ఆమోదిస్తారని అంటున్నారు. దాంతో ఈ చట్టం గురించి అంతా ఆసక్తిని చూపిస్తున్నారు. విషయానికి వస్తే ఇంతదాకా ఏ రాష్ట్రంలోనూ కేంద్ర స్థాయిలోనూ ప్రభుత్వాలు మారినప్పుడు పారిశ్రామిక ఒప్పందాలను కాపాడేందుకు ప్రత్యేకంగా ఇలాంటి చట్టం లేదని తెలుస్తోంది. ఇక ఏపీలో ఈ చట్టాన్ని అమలు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులలో విశ్వాసం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ స్థాయిలో ఇలాంటి చట్టం తీసుకురావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కూటమి ప్రభుత్వం సీఐఐ సదస్సు వేదికగా కోరింది.
చట్టంలో ఏముంది :
ఇదిలా ఉంటే డిసెంబర్ 5 నుంచి ఏపీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో ఈ బిల్లుని ప్రవేశపెడతారు అని అంటున్నారు. ఇక ఈ చట్టం గురించి ఆలోచించినపుడు సాధారణంగా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం లేదా సమీక్షించడం వల్ల పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాజకీయ అనిశ్చితిని తొలగించి పెట్టుబడులకు శాశ్వత భరోసా కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. ఇక ఈ చట్టం చేయడం ద్వారా ప్రధాన రక్షణల గురించి ఆలోచిస్తే కనుక రాష్ట్రంలో అధికార పార్టీ మారినా కొత్తగా వచ్చే ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసుకున్న పారిశ్రామిక ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయడానికి వీలుండదు అని అంటున్నారు. అలాగే పరిశ్రమలకు ప్రభుత్వం కేటాయించిన భూములు, అలాగే భూమి, నీటి ధరలకు సంబంధించి ఇచ్చిన హామీలకు చట్టబద్ధమైన రక్షణ ఉంటుందని చెబుతున్నారు.
వాటికి గ్యారంటీ :
అదే విధంగా ఏపీలో ఆయా పరిశ్రమల స్థాపన సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఆర్థికేతర రాయితీలు కానీ మౌలిక సదుపాయాల కల్పన హామీలు కచ్చితంగా అమలయ్యేలా ఈ చట్టం చూస్తుందని అంటున్నారు. అలాగే పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులు సకాలంలో అందేలా ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా విధానాన్ని కూడా కూటమి ప్రభుత్వం జతచేస్తోంది. ఒక విధంగా చూస్తే రాజకీయ కారణాలతో పరిశ్రమలపై వేధింపులు లేకుండా అనుమతుల విషయంలో పారదర్శకత ఉండేలా ఈ చట్టం రక్షణ కవచంలా పనిచేస్తుందని అంటున్నారు. అదే సమయంలో ఈ చట్టం కింద రక్షణ పొందే కంపెనీలకు కొన్ని నిబంధనలు కూడా ఉంటాయని అంటున్నారు. తమకు కేటాయించిన భూమిని కేవలం ఆమోదించిన ప్రాజెక్టు అవసరాలకు మాత్రమే వారు వినియోగించాల్సి ఉంటుంది. ఇక నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక వేళ కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేసే అధికారం కూడా ఈ చట్టంలో పొందుపరుస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం మారినపుడల్లా పెట్టుబడులు వెనక్కి మళ్ళిపోయే విధంగా ఉండే రాజకీయ సయ్యాట నుంచి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది అని అంటున్నారు.
