Begin typing your search above and press return to search.

కోర్టులో కేసున్నా లెక్కచేయటం లేదా ?

ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే మరోవైపు ప్రభుత్వం మౌళిక సదుపాయాల ఏర్పాటుకు పనులు ఎలా మొదలుపెడుతోందన్నది అర్ధంకావటంలేదు.

By:  Tupaki Desk   |   21 July 2023 5:33 AM GMT
కోర్టులో కేసున్నా లెక్కచేయటం లేదా ?
X

కోర్టులో కేసు విచారణ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకు వెళుతోంది. విషయం ఏమిటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ అని ఏర్పాటుచేసి 50 వేల మంది పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్లాట్లలో ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్రం కూడా సానుకూలంగానే స్పందించింది. మొదటివిడతలో 48 వేల ఇళ్ళు నిర్మించేందుకు రు. 710 కోట్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పింది.

అయితే చివరి నిముషంలో రాజధాని ప్రాంతంలో కొందరు కోర్టులో కేసు వేశారు. దాంతో కోర్టు అందరికీ నోటీసులు జారీచేసింది. ఇళ్ళపట్టాలు పంపిణీ చేయటం కోసమే సుప్రింకోర్టు అనుమతిచ్చిందా లేకపోతే ఇళ్ళు నిర్మించుకోవచ్చని కూడా చెప్పిందా అన్నది తేలుస్తామని హైకోర్టు చెప్పింది.

దాంతో కేంద్రం మంజూరుచేసిన ఇళ్ళ నిర్మాణాల ప్రక్రియ ఆగిపోయింది. అయితే అదే స్ధానంలో రాష్ట్రప్రభుత్వమే చర్యలు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లోపు 50 వేల ఇళ్ళని నిర్మించేయాలన్నది జగన్ పట్దుదల.

అందుకనే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మౌళిక సదుపాయాల ఏర్పాటుకు సీఆర్డీయే రు. 72 కోట్లతో పనులు మొదలుపెట్టింది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ప్రభుత్వం తాజాగా శ్రీకారం చుట్టింది. నైబర్ హూడ్ స్కూల్స్, ఈ హెల్త్ సెంటర్లు, అంగన్ వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయబోతోంది. లే అవుట్ల పచ్చదనం కోసం మొక్కలు నాటే పనులు మొదలైపోయాయి. రోడ్లు, కాల్వలు, వీధి దీపాల కోసం స్ధంబాలు నాటుతున్నారు.

కొన్ని పనులకు ఈనెల 24వ తేదీన జగన్ భూమిపూజ చేయబోతున్నారు. ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే మరోవైపు ప్రభుత్వం మౌళిక సదుపాయాల ఏర్పాటుకు పనులు ఎలా మొదలుపెడుతోందన్నది అర్ధంకావటంలేదు. రేపు కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం ఏమిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

ఇళ్ళు కట్టడంలేదు కేవలం మౌళిక సదుపాయాల కల్పన మాత్రమే చేస్తున్నామని చెప్పుకుంటుందా ? ఏమి చెప్పుకుని కేసులో నుండి ప్రభుత్వం బయటపడుతుందో చూడాలి. మొత్తానికి ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేలోగానే 50 వేల పట్టాల్లో ప్రభుత్వం ఏదో చేయబోతోందని అర్ధమైపోతోంది.