ఓటీటీ బబుల్ బ్లాస్ట్‌... మళ్లీ నిర్మాతల కష్టాలు!

గత ఐదేళ్ల కాలంలో సినిమా నిర్మాణంలో మెజార్టీ భాగం ఓటీటీ రైట్స్ అమ్మడం ద్వారా నిర్మాతలు రికవరీ చేసుకున్నారు.;

Update: 2025-12-30 11:30 GMT

ఒకప్పుడు సినిమా నిర్మాతకు థియేటర్ల ద్వారా వచ్చే మొత్తమే ఆదాయం. థియేటర్ల ద్వారా వచ్చిన మొత్తంలోంచి బడ్జెట్‌ తీయాలి, ఇతర ఖర్చులు తీసి మిగిలిన మొత్తం లాభంగా పరిగణించేవారు. కొంత కాలం తర్వాత ఆడియో రైట్స్ ద్వారా కొంత మొత్తం వచ్చేది. దాంతో నిర్మాతలకు కాస్త ఊరట లభించినట్లే అయింది. ఆ తర్వాత శాటిలైట్‌ రైట్స్ ద్వారా భారీ మొత్తంలో నిర్మాతలకు లాభాలు వచ్చేవి. మీడియం రేంజ్ సినిమాలకు ఎక్కువ శాతం ఆడియో రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌తో బడ్జెట్‌ రికవరీ అయ్యేది. థియేటర్ల ద్వారా వచ్చిన మొత్తం లాభంగా ఉండేది. గడచిన పదేళ్ల కాలంలో ఓటీటీల ప్రవాహం పెరిగింది. ఓటీటీల మధ్య పోటీ పెరిగి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వారు ముందుకు వచ్చారు. పదుల కోట్లు దాటి వందల కోట్లను ఖర్చు చేసి మరీ సినిమాల స్ట్రీమింగ్‌ హక్కులను ఓటీటీలు కొనుగోలు చేయడంతో నిర్మాతలు తడి గుడ్డ వేసుకుని నిద్రించే రోజులు వచ్చాయి.

భారీ బడ్జెట్‌ సినిమాలకు ఓటీటీలు..

గత ఐదేళ్ల కాలంలో సినిమా నిర్మాణంలో మెజార్టీ భాగం ఓటీటీ రైట్స్ అమ్మడం ద్వారా నిర్మాతలు రికవరీ చేసుకున్నారు. ఇక ఆడియో, థియేట్రికల్‌ రైట్స్ ద్వారా మిగిలిన బడ్జెట్‌ రికవరీ చేసుకుని లాభాలను చూసేవారు. ఓటీటీ లు పెద్ద ఎత్తున రైట్స్ కి డబ్బులు ఇస్తున్న నేపథ్యంలో నిర్మాతలు సైతం హీరోల పారితోషికాలు, మేకింగ్‌ కి భారీ ఎత్తున ఖర్చు చేయడం జరిగింది. గత ఐదేళ్లుగా పెరిగిన ఓటీటీ బబుల్‌ బ్లాక్ అయ్యిందని నిర్మాత నాగవంశీ అంటున్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓటీటీల ద్వారా గతంలో మాదిరిగా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ముందు ముందు మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన నిర్మాతలను హెచ్చరించాడు. ఓటీటీలు ఇప్పటికే సినిమా స్ట్రీమింగ్‌ రైట్స్ ను తీసుకునేందుకు చాలా కండీషన్స్ పెడుతున్నాయి. స్క్రిప్ట్‌ నచ్చితేనే ముందుకు వెళ్తున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత కఠినంగా మారే ప్రమాదం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు.

చిన్న సినిమాల రిలీజ్ విషయంలో...

ఓటీటీ ఆదాయం కు గండి పడుతున్న నేపథ్యంలో కచ్చితంగా మళ్లీ థియేటర్ల ఆదాయం పై నిర్మాతలు ఆధారపడాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా ఓటీటీలు ఎలాగూ అంత మొత్తంలో రైట్స్‌ కి డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు కనుక థియేటర్ల ద్వారా సాధ్యం అయినంత వరకు కలెక్షన్స్ రాబట్టుకునేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఓటీటీల నుంచి వచ్చే మొత్తం తగ్గనున్న నేపథ్యంలో సినిమాల బడ్జెట్‌ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా హీరోలతో మాట్లాడి వారి పారితోషికం ను సైతం తగ్గించే పరిస్థితి ఉంది. మొత్తానికి రాబోయే ఏడాది రెండేళ్ల కాలంలో చాలా మార్పులు రాబోతున్నాయి. కేవలం చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా అన్ని రకాల సినిమాలకు ఇది వర్తిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ఓటీటీల నుంచి వచ్చే ఆదాయం తగ్గడం అనేది నిర్మాతలకు కష్టాలు తెచ్చి పెట్టవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సినిమా ఇండస్ట్రీలో ఓటీటీలు..

మరికొందరు మాత్రం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పై ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కి చెందిన వారి ఆధిపత్యం కొనసాగుతోంది. అది రాబోయే రోజుల్లో కొంత వరకు అయినా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు ప్రతి సినిమా యొక్క విడుదల తేదీని ఓటీటీలు నిర్ణయిస్తున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల తేదీని నిర్మాత, దర్శకుడు కాకుండా ఓటీటీలు ఖరారు చేయడం అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల యొక్క బడ్జెట్‌ ను సైతం ఓటీటీలు నిర్ణయిస్తున్నాయి. ఒక స్క్రిప్ట్‌ ను చూసి వారు బడ్జెట్‌ నిర్ణయించి, దాంట్లో నిర్మిస్తే తాము ఇంత ఇస్తామని వారు కండీషన్స్‌ పెడుతున్నారు. ముందు ముందు ఓటీటీలపై ఆధారపడితే నిర్మాణం కష్టం అవుతుందని కొందరు అంటున్నారు. మొత్తానికి చాలా తక్కువ సమయంకే ఓటీటీ బబుల్‌ బ్లాక్ కావడంను కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ స్వాగతిస్తే, కొందరు మాత్రం ఓటీటీ బబుల్‌ బ్లాస్ట్‌ తో నిర్మాతలకు కష్టాలు తప్పవనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News