ఓటీటీలోకి కాంతార చాప్టర్ 1.. ఎప్పుడు? ఎక్కడంటే?

కాంతార.. ప్రాంతీయంగా విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సొంతం చేసుకుంది.;

Update: 2025-10-28 08:24 GMT

కాంతార.. ప్రాంతీయంగా విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. 2022లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 అంటూ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఏకంగా బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి.. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ ఫిలిమ్స్ లిస్టులో 13వ స్థానాన్ని దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన విషయం తెలిసిందే.

అందులో భాగంగానే తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబర్ 31 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అమెజాన్ విడుదల చేసిన ఈ అధికారిక ప్రకటనతో అభిమానులు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా అంతర్జాతీయ ప్రేక్షకులే లక్ష్యంగా అక్టోబర్ 31న ఇంగ్లీషులో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇటు ఇండియన్ బాక్సాఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేసిన కాంతార చాప్టర్ 1, అటు ఇంగ్లీషులో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. అలాగే ఓటీటీ లో ఎలాంటి టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంటుందో తెలియాల్సి ఉంది.

కాంతార చాప్టర్ 1 సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఎనిమిదవ దశాబ్దంలో కదంబల రాజ్యపాలనలో జరిగే కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ రాజ్యంలో ఒకవైపు ఉన్న అటవీ ప్రాంతంలోని దైవిక భూమి కాంతార.. అందులోని ఈశ్వరుడి పూదోటకు.. అక్కడున్న మార్మిక బావికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఆ ప్రాంతంపై దుష్టశక్తులు కన్ను పడకుండా.. తమ రాజ్యంలోకి బయట వాళ్ళు అడుగుపెట్టకుండా కాంతార గిరిజన తెగ జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. అయితే ఆ తెగకు ఒకసారి అనుకోకుండా అక్కడున్న బావిలో ఒక బిడ్డ దొరుకుతాడు. అతడిని దైవ ప్రసాదంగా భావించి బెర్మే (రిషబ్ శెట్టి) అని పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తారు.

అయితే ఒకసారి తమ రాజ్యంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించిన బాంగ్రా దేవరాజు కుల శేఖర (గుల్షన్ దేవయ్య ) , అతని సైనిక మూకకు తగిన బుద్ధి చెబుతాడు బెర్మే . ఆ ఘటన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఎలా విదేశీ వర్తకం చేస్తున్నారు? గిరిజనులను వెట్టి చాకిరీ పేరుతో ఎలా హింస పెడుతున్నారు? తెలుసుకుంటాడు. తర్వాత బాంగ్రా రాజును ఎదిరించి సొంతంగా వ్యాపారం చేయడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత ఏమైంది? బెర్మే తీసుకున్న నిర్ణయం కాంతార తెగకు ఏదైనా ముప్పు కలిగించిందా ? పలు విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించారు.



Tags:    

Similar News