సీఎస్‌కే భవిష్యత్తుకు ధోనీ మాస్టర్ ప్లాన్!

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే ) అభిమానులకు ఎంఎస్ ధోనీ అంటే కేవలం ఒక ఆటగాడు కాదు, అంతకుమించిన ఎమోషన్.

Update: 2026-05-19 13:37 GMT

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే ) అభిమానులకు ఎంఎస్ ధోనీ అంటే కేవలం ఒక ఆటగాడు కాదు, అంతకుమించిన ఎమోషన్. ఈ సీజన్‌లో గాయం వల్ల ఆయన ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా, పసుపు జెర్సీ వేసుకుని మైదానంలోకి రాకపోయినా.. ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే, తాజాగా చెపాక్ మైదానంలో జరిగిన ల్యాప్ ఆఫ్ ఆనర్, అలాగే సురేష్ రైనాతో ధోనీ అన్న మాటలు చూస్తుంటే ఆయన ప్లేయర్‌గా ఇక చాలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ధోనీ కొత్త ఇన్నింగ్స్ ఏంటి? సిఎస్‌కె భవిష్యత్తు కోసం వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆడకుండానే ‘ఇంపాక్ట్’ చూపించిన ఏకైక లీడర్:

క్రికెట్ చరిత్రలో కోట్ల రూపాయలు పెట్టి కొన్న ఏ ఆటగాడైనా సరే, మ్యాచ్‌లు ఆడకపోతే జట్టుకు పెద్ద మైనస్ అవుతారు. కానీ ఆ రూల్ ధోనీకి వర్తించదు. ఇక ఈ సీజన్ మొత్తం ధోనీ కేవలం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమైనా, మైదానం వెలుపల ఉంటూనే యువ క్రికెటర్లకు దిశానిర్దేశం చేస్తూ జట్టును నడిపించారు. ఇక మ్యాచ్ ఆడకుండానే ఒక సీజన్ మొత్తంపై ఇంతటి బలమైన ముద్ర వేయడం కేవలం 'తలా'కు మాత్రమే సాధ్యమైంది.

‘మెంటార్’ బాధ్యతలకు గ్రీన్ సిగ్నల్?:

సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇచ్చిన ప్రకటన గమనిస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతోంది. వచ్చే ఏడాది ధోనీ పసుపు జెర్సీ వేసుకుని బ్యాట్ పట్టుకోకపోయినా.. డగౌట్‌లో మెంటార్ లేదా టాక్టికల్ అడ్వైజర్ రూపంలో కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. భవిష్యత్తు తరం కోసం కొత్త ఆటగాళ్లను తయారు చేసే పనిలో జట్టు ఉంది అని ఫ్లెమింగ్ అనడం వెనుక.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టీమ్‌ను పూర్తిగా ధోనీ వెనకుండి గైడ్ చేయబోతున్నారనే ప్లాన్ దాగి ఉంది.

‘ల్యాప్ ఆఫ్ ఆనర్’ వెనుక అసలు మర్మం:

ఇక చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ముగిశాక ధోనీ గ్రౌండ్ చుట్టూ తిరగడం అనేది ఒక సైలెంట్ ఫేర్‌వెల్ లాంటిదే అని ఇండస్ట్రీ వర్గాల టాక్. గతంలో టీమిండియాకు కూడా ఆయన ఎవరికీ చెప్పకుండా సైలెంట్‌గా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఇప్పుడు చెపాక్ వేదికగా అభిమానులకు అభివాదం చేశారంటే.. హోమ్ గ్రౌండ్‌లో ప్లేయర్‌గా తన ప్రయాణానికి ఇదే ముగింపు అని ధోనీ ఫిక్స్ అయ్యారనే ట్విస్ట్ ఇందులో దాగివుందని సమాచారం.

సన్‌రైజర్స్ చేతిలో ఓటమి.. ఒక యుగం ముగింపు?:

ఎప్పుడూ చెపాక్ మైదానంలో చెన్నైని ఓడించడం ప్రత్యర్థి జట్లకు ఒక పెద్ద టాస్క్. అలాంటి కోటలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చి 5 వికెట్ల తేడాతో సిఎస్‌కెను ఓడించడం, అదే మ్యాచ్‌లో ధోనీ వీడ్కోలు సంకేతాలు రావడం..సోషల్ మీడియాలో ఐపీఎల్‌లో ఒక అజేయమైన 'చెపాక్ యుగం' ముగుస్తోందా అనే చర్చకు దారితీస్తోంది.

ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే వార్త అభిమానులను కలచివేస్తున్నా.. మెంటార్‌గా ఆయన కొత్త పాత్రలో అడుగుపెట్టడం మాత్రం సిఎస్‌కె భవిష్యత్తుకు పెద్ద బలంగా మారనుంది. స్క్రీన్ మీద బ్యాటింగ్ చేస్తూ కనిపించకపోయినా, డ్రెస్సింగ్ రూమ్ నుంచి ధోనీ ఇచ్చే సలహాలు, వ్యూహాలు చెన్నై జట్టును మరిన్ని ఏళ్లు సక్సెస్ బాటలో నడిపిస్తాయని అభిమానులు గట్టి నమ్మకం తో వున్నారు.

Tags:    

Similar News