ఐపీఎల్-2026 అసలు సిసలు 'వసూల్ రాజా' వైభవ్ సూర్యవంశీ!
సాధారణంగా 15 ఏళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ఈక్వేషన్లు అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటారు.
సాధారణంగా 15 ఏళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ఈక్వేషన్లు అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటారు. ఇంట్లో వాళ్ళు "బాగా చదివితేనే ఫ్యూచర్ ఉంటుంది రా!" అని క్లాసులు పీకుతుంటే సైలెంట్‌గా తల దించుకుని వింటారు. కానీ బీహార్ నుంచి వచ్చిన ఓ 15 ఏళ్ల కుర్రాడు మాత్రం... బుక్కులు పక్కన పెట్టి ఐపీఎల్ లో బ్యాట్ పట్టుకున్నాడు. అంతే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడమే కాదు.. ఏకంగా ఐపీఎల్ ఖజానాకే కన్నం వేసి.. కోట్లలో క్యాష్ ప్రైజ్‌లు కొట్టేసి అందరికీ మైండ్ బ్లాక్ చేశాడు!
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ ‘వండర్ కిడ్’ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 సీజన్‌ను తన సొంత టోర్నమెంట్‌లా మార్చేసుకున్నాడు. కొందరు జీవితాంతం రాత్రింబవళ్లు ఉద్యోగాలు చేసినా సంపాదించలేని సొమ్మును, ఈ బుడ్డోడు కేవలం రెండు నెలల గ్యాప్‌లో అదీ కేవలం ఒక చెక్క ముక్క బ్యాట్ ఊపి సంపాదించేశాడు. ఈ సీజన్‌లో అతడు బాదిన పరుగులు ఎంతో తెలుసా? అక్షరాలా 776 పరుగులు. అది కూడా టి20 క్రికెట్ చరిత్రలోనే కళ్లు తిరిగే 237.31 స్ట్రైక్ రేట్‌తో! అతడి బ్యాటింగ్ చూస్తుంటే బౌలర్లకు బంతి వేయాలంటేనే భయం వేసింది. "బాబుగారూ! మా బౌలింగ్ రేటింగ్‌లు పడిపోతున్నాయి, కాస్త దయచూపండి" అని బౌలర్లు వేడుకున్నా వినకుండా వచ్చిన ప్రతి బంతినీ బౌండరీ అవతలికి పార్సిల్ చేసేశాడు.
అవార్డుల క్యూ... హోల్ సేల్ దోపిడీ!
ఒక టోర్నమెంట్‌లో ఒక్క అవార్డు వస్తేనే ఆటగాళ్లు ఎగిరిపోతారు. కానీ వైభవ్ విషయంలో అవార్డుల కమిటీ వాళ్లే కన్ఫ్యూజ్ అయిపోయి. "అన్నీ ఇతనికే ఇచ్చేయండి బాబు" అన్నట్టు వ్యవహరించారు. ఒక్కసారి ఆ లిస్ట్ చూస్తే అదే నిజమనిపిస్తుంది.
ఆరెంజ్ క్యాప్: రూ. 10 లక్షలు
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ : రూ. 10 లక్షలు
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: రూ. 10 లక్షలు
అత్యధిక సిక్సర్ల అవార్డు: రూ. 10 లక్షలు
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: రూ. 20 లక్షలు
మొత్తం నగదు బహుమతి.. రూ. 60 లక్షలు!
దీనికి అదనంగా మెరిసిపోయే ఒక బ్రాండ్ న్యూ టాటా సియారా కారు కూడా సంపాదించడం విశేషం.
ఇది చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్‌తో ఊదరగొడుతున్నారు. "మా ఇంట్లో టెన్త్ క్లాస్‌లో 95% వస్తే ‘గుడ్ బాయ్’ అని ఒక గుడ్‌డే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు... ఇక్కడ వైభవ్ చూస్తే సిక్సర్లు కొట్టి ఏకంగా కారే పట్టుకెళ్ళిపోయాడు!" అంటూ ఒకరు కామెంట్ పెడితే.. "సార్.. డ్రైవింగ్ లైసెన్స్ రావడానికే ఇంకా మూడేళ్లు టైం ఉంది.. అప్పుడే కారు గెలిచేస్తే ఎలా?" అంటూ ఇంకొకరు లాజిక్ తీస్తున్నారు.
మారిన పేరెంట్స్ మైండ్ సెట్!
ఈ బుడ్డోడి దెబ్బకి ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ సీన్ మారిపోయింది. ఒకప్పుడు "చదువుకోకపోతే బాగుపడవు.. క్రికెట్ ఆడితే తిండి పెట్టరు" అని తిట్టే తల్లిదండ్రులే... ఇప్పుడు పిల్లల చేతికి బలవంతంగా బ్యాట్ ఇచ్చి గ్రౌండ్‌కి తోలుతున్నారు. "రేయ్! చదువుకుంది చాలు గానీ, వెళ్లి ఓ నాలుగు సిక్సర్లు కొట్టడం నేర్చుకోపో... కనీసం ఒక స్కూటర్ అయినా వస్తుంది.. మన ఇల్లు గడుస్తుంది" అని పేరెంట్స్ ఓపెన్‌గా డిస్కషన్లు పెడుతున్నారు.
పాపం.. బౌలర్ల పరిస్థితి అయితే మరీ దారుణం. వైభవ్ క్రీజులోకి వస్తే చాలు స్కూల్ పిల్లవాడి ముందు నిలబడ్డ ఎగ్జామినర్ లా ఫీలయ్యారు. వాళ్ళు వేసిన ప్రతి బంతిని సరిహద్దులు దాటించడమే కాకుండా ప్రెజెంటేషన్ సెరిమనీలో వాళ్ల కళ్ల ముందే ట్రోఫీలను లగేజ్ బ్యాగుల్లో సర్దుకుని వెళ్లిపోయాడు.
చివరగా చెప్పేదేంటంటే... ఐపీఎల్-2026లో ట్రోఫీ ఏ టీమ్ గెలిచింది? రన్నరప్ ఎవరు? అనే విషయాలు ఫ్యాన్స్ కాలక్రమేణా మర్చిపోతారేమో కానీ... "ఒక 15 ఏళ్ల బుడ్డోడు వచ్చి ఐపీఎల్ ఖజానాను క్లీన్ స్వీప్ చేసి, కారు వేసుకుని వెళ్లిపోయాడు" అనే క్రేజీ స్టోరీ మాత్రం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది!