చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ గా ఎంఎస్ ధోని?

2026 సీజన్‌లో సీఎస్‌కే ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సాంప్రదాయ పద్ధతులకే పరిమితమవుతూ ఆధునిక టీ20 క్రికెట్‌కు తగ్గట్టుగా జట్టును నడిపించడంలో ఫ్లెమింగ్ విఫలమయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Update: 2026-05-23 18:30 GMT

గత కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యూహాలు ఈసారి ఫలించలేదు. 2026 సీజన్‌లో సీఎస్‌కే ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సాంప్రదాయ పద్ధతులకే పరిమితమవుతూ ఆధునిక టీ20 క్రికెట్‌కు తగ్గట్టుగా జట్టును నడిపించడంలో ఫ్లెమింగ్ విఫలమయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జట్టుకు సరికొత్త ఆలోచనలు, దూకుడున్న నాయకత్వం కావాలంటూ మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

“యూట్యూబ్‌లో టీమ్ లీక్ చేస్తాడు”.. నెటిజన్ సెటైర్‌కు అశ్విన్ ‘బోల్డ్’ కౌంటర్!

ఈ మార్పుల చర్చల నడుమ, సీఎస్‌కే తదుపరి కోచ్‌గా అశ్విన్ వస్తే బాగుంటుందనే ప్రతిపాదన కొందరు అభిమానుల నుంచి వచ్చింది. దీనిపై ఓ నెటిజన్ ఎక్స్‌ వేదికగా వ్యంగ్యంగా స్పందిస్తూ... "ఎవరినైనా కోచ్‌గా తీసుకోండి కానీ అశ్విన్‌ను మాత్రం వద్దు. మ్యాచ్‌కు ముందే తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించి వ్యూస్ సంపాదించుకుంటాడు" అంటూ కామెంట్ చేశాడు. సాధారణంగా ఇలాంటి ట్రోల్స్‌ను లైట్ తీసుకునే అశ్విన్.. ఈసారి మాత్రం గట్టిగానే బుద్ధి చెప్పాడు. క్రికెట్ నిబంధనలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడొద్దంటూ ఘాటుగా బదులిచ్చాడు. అశ్విన్ రిప్లై ఇస్తూ "అవును.. నేను ముందే తుది జట్టును ప్రకటిస్తా. మా బౌలింగ్, బ్యాటింగ్ వ్యూహాలన్నీ ప్రత్యర్థులకు ముందే చెప్పేస్తా. ఒకవేళ నేను అలా చేస్తే యాంటీ కరప్షన్ యూనిట్ నన్ను పట్టుకుని జైల్లో పెడుతుంది. మీకు కనీసం ఆ నియమాలు కూడా తెలియవా?" అంటూ నెటిజన్ నోరు మూయించాడు.

"ధోనీ ఉండగా.. మరో కోచ్ ఎందుకు?"

ఈ వివాదానికి అక్కడితో స్వస్తి పలకకుండా చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తు కోచ్‌పై అశ్విన్ ఒక కీలకమైన ప్రశ్నను విసిరాడు. "అసలు ఎంఎస్ ధోనీ జట్టుతోనే ఉన్నప్పుడు, సీఎస్‌కే మరో హెడ్ కోచ్ కోసం ఎందుకు వెతకాలి?" అంటూ అశ్విన్ వేసిన ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ధోనీ లాంటి అత్యుత్తమ మైండ్ గేమ్ ప్లానర్, ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన లీడర్ అందుబాటులో ఉన్నప్పుడు కొత్త కోచ్ అన్వేషణ అనవసరమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

ప్లేయర్‌గా కాకపోయినా.. కోచ్‌గా ‘థాలా’ ఎంట్రీ ఖాయమేనా?

ప్రస్తుతం ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. వయసు రీత్యా, ఫిట్‌నెస్ సమస్యల రీత్యా వచ్చే సీజన్‌లో ధోనీ ఆటగాడిగా బరిలోకి దిగుతాడా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అతను జట్టును వీడి వెళ్లే ప్రసక్తే లేదని అందరికీ తెలిసిందే.

అశ్విన్ అన్నట్లుగానే ఒకవేళ స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకుంటే.. ధోనీ సీఎస్‌కే హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి వంద శాతం అర్హుడు. ఆటగాడిగా మైదానంలో లేకపోయినా డ్రెస్సింగ్ రూమ్ నుండి ధోనీ ఇచ్చే సలహాలు, వ్యూహాలు జట్టుకు కొండంత బలాన్ని ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరి అశ్విన్ ఊహించినట్లుగానే 'యెల్లో ఆర్మీ' బాధ్యతలను ధోనీ కోచ్ రూపంలో అందుకుంటాడా? లేదా మెంటర్‌గా ఉంటూ ఫ్లెమింగ్ స్థానంలో సరికొత్త విదేశీ కోచ్‌ను తీసుకొస్తారా? అనేది తెలియాలంటే సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే!

Tags:    

Similar News