వారి జిందగీలో పాకిస్థాన్ లేదు!

Update: 2016-09-26 04:54 GMT
యురి ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై ఎవరికి తోచిన విదంగా వారు, ఎవరి స్థాయిలో వారు, వారి వారి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో కొంతమంది కేవలం మాటలకే పరిమితం అయిపోతే మరికొందరు తమకు తోచిన స్థాయిలో చేతల్లో చూపిస్తున్నారు. ఈ విషయంలో పాక్ లో తమ ప్రదర్శనలను నిలిపేసేవారు కొందరైతే.. మరికొందరు మరో రకంగా స్పందిస్తున్నారు. ఈ సమయంలో జీటీవీ గ్రూపులోని జిందగీ చానల్ పాక్ పై తమ ఆగ్రహాన్ని, అసహనాన్ని తనకున్న అవకాశం మేర ప్రదర్శించింది.

ఈజిప్టు, టర్కీ, పాకిస్థాన్ దేశాల నుంచి కార్యక్రమాల్ని తీసుకుని తన ఛానల్‌ లో ప్రసారం చేస్తుంటుంది జీ జిందగీ! అయితే ఇకపై జీటీవీ గ్రూపులోని జిందగీ చానల్ పాక్‌ కార్యక్రమాల్ని ప్రసారం చేయడాన్ని నిలిపివేయనున్నట్లు జీ గ్రూప్‌ అధినేత సుభాష్‌ చంద్ర వెల్లడించారు. దీనికి ప్రధాన కారణంగా... పాకిస్థాన్ కు చెందిన కళాకారులు భారత్‌ ను విడిచి రావాల్సిందిగా ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పిలుపునివ్వడం దురదృష్టకరమని ఆయన అన్నారు. షరీఫ్‌ అలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని అందుకే జీ జిందగీలో పాకిస్థాన్ కి సంబందించిన, పాకిస్థాన్ ఆధారిత కార్యక్రమాల్ని నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఈ జీగ్రూప్‌ జిందగీ ఛానల్‌ ను 2014లో ప్రారంభించింది. జిందగీ ఛానల్‌లో ప్రసారమైన హమ్‌ సఫర్, ఆన్‌ జారా, కిత్నీ గిర్‌ హైన్‌ బాకీ హైన్, గుల్జార్‌ హై, మాత్‌ అండ్‌ జిందగీ వంటి అనేక కార్యక్రమాలు పాకిస్తాన్‌ తోపాటు మనదేశంలోనూ విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో పాక్ ఆధారిత కార్యక్రమాలేవీ జీ జిందగీలో ప్రసారం కావని సుభాష్ చంద్ర తెలిల్పారు. కాగా... పాక్‌ కళాకారులు తక్షణం భారత్‌ ను విడిచివెళ్లాల్సిందిగా మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన అధినేత రాజ్ థాకరే హెచ్చరించిన సంగతి తెలిసిందే.. ఆయన ఈ మేరకు బాలీవుడ్ నిర్మాతలకు ఒక లేఖ రాశారు.
Tags:    

Similar News