పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ అనంతబాబు

Update: 2022-05-23 15:25 GMT
రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు. అనంతబాబును రిమాండ్ ను కూడా తరలించే అవకాశం ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుపై సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.

ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఇంతవరకూ ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకోకపోవడంపై రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. పోలీసులపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి.

తాజాగా పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ఏఆర్ కార్యాలయం నుంచి గట్టి బందోబస్తు మధ్య ఆయన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా కాకినాడ జీజీహెచ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

ఉదయం నుంచి అనంతబాబు అరెస్ట్ పై ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అనంతబాబు స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అదనపు ఎస్పీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. మధ్యాహ్నం నుంచి అనంతబాబును విచారించారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత అనంతబాబును రిమాండ్ కు తరలించనున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు.
Tags:    

Similar News