నువ్వు ఎవరు? పోటుగాడివా? ఉదయభానుపై వెల్లంపల్లి ఫైర్

Update: 2023-01-25 10:00 GMT
ఏపీ అధికారపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడో సిత్రమైన సీన్ కనిపిస్తోంది. ఇంతకాలం రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడిన వారు.. ఇప్పుడు అంతర్గతంగా ఉన్న రాజకీయ విబేధాలతో సొంత పార్టీకి చెందిన నేతలు ఒకరిపై ఒకరు తిట్టుకునే కొత్త కల్చర్ కు తెర మీదకు తీసుకొచ్చారు. అది కూడా పబ్లిక్ గానే. రాజకీయ పార్టీలు అన్నంతనే అందరూ ఐకమత్యంతో ఉంటారనుకోవటం తప్పులో కాలేసినట్లే. తమ కడుపులో ఉన్న కోపాన్ని పెదాల వరకు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

అందుకు భిన్నంగా వైసీపీ నేతలు ఇటీవల కాలంలో సొంత పార్టీకి చెందిన నేతలపై గుర్రుగా ఉంటున్నారు. వారు ఎదురుపడినా.. ఒకే వేదికను షేర్ చేసుకున్నా.. తమ ఆగ్రహాన్ని తమలో దాచుకోకుండా బయటపెట్టేసుకుంటున్నారు. తాజాగా జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఎదురుపడిన వెంటనే.. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎదురుపడటం.. ఆ వెంటనే వెనుకా ముందు చూసుకోకుండా నోరు పారేసుకున్న వైనం సంచలనంగా మారింది.

దీనికి విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పుట్టినరోజు కార్యక్రమం వేదికగా మారింది. బొప్పన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే ఉదయభాను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చారు. తిరిగి వెళుతున్న వేళలో.. సొంత పార్టీకి చెందిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు.. విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న దేవినేని అవినాష్ లు ఎదురుపడ్డారు.

ఉదయభానును చూసినంతనే   ఆగ్రహానికి గురైన వెల్లంపల్లి.. సీఎం వద్దకు శ్రీనివాస్ ను తీసుకెళ్లటానికి నువ్వు ఎవరు? పోటుగాడివా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఉదయభాను అంతే ఆగ్రహాన్నిప్రదర్శిస్తూ.. పార్టీలో సీనియర్ నేతను.. నీలా పదవి కోసం పార్టీ మారలేదని పంచ్ వేశారు. మూడు పార్టీలు మారిన ఊసరవెల్లివి నువ్వు.. నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాడంటూ మండిపడ్డారు. దీంతో.. ఒక్కసారిగా షాక్ తిన్నవైసీపీ వర్గాలు వారిద్దరిని పక్కకు తీసుకెళ్లి సముదాయించారు.

ఇంతకీ వెల్లంపల్లి శ్రీనివాసరావుకు అంత కోసం ఎందుకంటే.. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెలంపల్లి సైతం ఓటమిపాలయ్యారు. తన ఓటమికి ఆకుల కారణమన్నది వెల్లంపల్లి భావన. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆకుల వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.

గత వారం ఉదయభాను ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లగా.. తన కుమార్తె లగ్న పత్రికను ముఖ్యమంత్రికి ఇవ్వటానికి వచ్చానని ఆకుల చెబితే..ఆయన్ను జగన్ కు కలిపించారు.దీంతో వెల్లంపల్లి తీవ్రఆగ్రహంతో ఉన్నారు. అదికాస్తా తాజాగా ఉదయభాను కనిపించినంతే బరస్ట్ కావటం.. అది కాస్తా ఇప్పుడుచర్చనీయాంశంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News