పౌరులందరి డేటా.. కేంద్రం గుప్పిట

Update: 2021-11-30 23:30 GMT
మీ ఆర్థిక స్ఠితి ఏమిటి? మీరు ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధి ఏమిటి? అందుకు మీరు అర్హులేనా? కాకుంటే అసలు ఎంతమంది అనర్హలు ఇలా లబ్ధి పొందుతున్నారు? ఇలాంటి వివరాలన్నీ ఇకపై కేంద్ర ప్రభుత్వ చేతుల్లోకీ వెళ్లనున్నాయి.

జనన మరణాల నమోదు చట్టం1969కు సవరణగా దీన్ని పేర్కొంటున్నప్పటికీ... పౌరుల సమాచారం గుప్పిట పట్టడం.. రాష్ట్లాల అధికారాలకు కత్తెర వేయడం.. ఇలా దీనివెనుక ఎన్నో కోణాలు కనిపిస్తున్నాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అయితే.. మరింత ముందుకెళ్లి సమాచారం అంతటినీ కేంద్రం చేతుల్లోకి తీసుకుని దానిని ఎన్పీఆర్-ఎన్ఆర్సీ వంటి వివాదాస్పద అంశాలకు వాడుకుంటుందని ఆరోపిస్తున్నారు.

మొత్తానికి వివరాల్లోకి వస్తే.. పౌర సరఫరాలు, రవాణా లాంటి శాఖల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. వీటి పరిధిలో రేషన్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులను రాష్ట్రమే అందజేస్తుంది. ఓటరు జాబితా వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఈ శాఖలు సేకరించిన పౌరుల వివరాలను భద్రపరిచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ సమాచారం తమ వద్ద కూడా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ కొత్త ఆలోచన తెరపైకి తెచ్చింది.

జనన, మరణాల రిజిస్ట్రేషన్‌ బాధ్యతను ఇకనుంచి పూర్తిగా తామే నిర్వహిస్తామంటూ జనన, మరణాల రిజిస్ట్రేషన్‌ చట్టం-1969కి సవరణకు సిద్ధమైంది. ఈ చట్టంలో సవరణలు జరగటం ఇదే తొలిసారి కాదు. 2012లో యూపీఏ-2 ప్రభుత్వంలోనూ సవరణలు జరిగినా.. అవి చిన్నచిన్నవే. ఈసారి మొత్తం వ్యవస్థనే కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోనుంది. దీని ప్రకారం జనన, మరణ రిజిస్ట్రేషన్‌ వివరాల పర్యవేక్షణ కేంద్ర హోంశాఖ ఆధీనంలోకి వెళ్తుంది.

అమలుకు జాతీయ స్థాయిలో రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఉంటారు. ఈయన పర్యవేక్షణలో రాష్ట్రాల్లో రిజిస్ట్రార్లు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. జనన ధ్రువీకరణపత్రం పొందాలంటే చిన్నారి తల్లిదండ్రుల ఆధార్‌ వివరాలనూ సమర్పించాలి. ఇక రాష్ట్రాల వద్ద ఉన్న పౌరుల జనన, మరణ రిజిస్ట్రేషన్‌ వివరాలతో పాటు కొత్తగా సేకరించే సమాచారాన్ని కేంద్రానికీ అందించాలి. జనన, మరణ వివరాలను డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డులు, ఓటరు జాబితా, పాస్‌పోర్టు, ఆధార్‌ వివరాలతో అనుసంధానిస్తామని కేంద్ర హోం శాఖ సవరణల్లో స్పష్టం చేసింది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద ఉన్న పౌరుల సమాచారాన్నీ కేంద్రంతో పంచుకోవాల్సి ఉంటుంది.
Tags:    

Similar News