పిట్రోడా లాంటోడికి మాట్లాడ‌టం రాద‌ట‌!

Update: 2019-05-11 04:50 GMT
మాట జార‌టం ఎందుకు?.  దానికి విప‌రీత‌మైన క‌వ‌రింగ్ తో కిందా మీదా ప‌డ‌టం ఎందుకు?  అన్న‌ది ప్ర‌శ్న‌. అంతేనా.. అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారు ఇష్టారాజ్యంగా మాట్లాడ‌టం వ‌ల్ల ప్ర‌యోజ‌నం సంగ‌తి త‌ర్వాత అన‌వ‌స‌ర‌మైన ప్ర‌యాస‌ల‌కు కార‌ణంగా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నోటి మాట‌తో వ‌చ్చే చేటు శ్యామ్ పిట్రోడా లాంటి మేధావికి కూడా చెప్పాల్సి రావ‌టం దుర‌దృష్ట‌క‌రంగా చెప్పాలి.

ఎంత మేధావి అయినా రాజ‌కీయం మీద‌కు వ‌చ్చేశాక‌.. నోటిమాట‌ల్లో తెంప‌రిత‌నం దానంత‌ట అదే వ‌చ్చేస్తుందా? అన్న భావ‌న పిట్రోడా మాట‌ల్ని వింటే క‌లుగ‌క మాన‌దు. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ధ‌ర్మ‌శాల‌లో గురువారం జ‌రిగిన ఒక విలేక‌రి అడిగిన మాట‌లు దావ‌న‌లంలా మారి.. ర‌చ్చ ర‌చ్చ చేశాయి. కాంగ్రెస్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ‌ట‌మే కాదు.. పిట్రోడా అదే ప‌నిగా త‌న మాట‌ల్ని క‌వ‌ర్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల‌పై ప్ర‌శ్న‌ను సంధించిన‌ప్పుడు.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడాల్సిన పిట్రోడా.. జ‌రిగిందేదో జ‌రిగిపోయిందంటూ అదాటున అనేశారు. ఎక్క‌డో ధ‌ర్మ‌శాల‌లో ఒక రిపోర్ట‌ర్ తో అన్న మాట‌లు.. పార్టీకే మంట పుట్టించేలా మార‌తాయ‌ని ఊహించ‌లేదో ఏమో?  పిట్రోడా మాట‌లు వివాదాస్ప‌దం కావ‌టం.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం కావ‌టంతో పిట్రోడా త‌న మాట‌ల‌కు సారీ చెప్పాల్సి వ‌చ్చింది.

కాంగ్రెస్ అధ్య‌క్షుడి నుంచి వ‌చ్చిన ఆదేశాల‌తో వెన‌క్కి త‌గ్గిన ఆయ‌న‌.. హిందీలో తాను అన్న మూడు ప‌దాల్ని పూర్తిగా వ‌క్రీక‌రించార‌న్నారు. త‌న హిందీ అంత బాగోద‌ని.. దాన్ని అవ‌కాశంగా తీసుకొని విమ‌ర్శ‌లు చేశార‌న్నారు. ఏది జ‌రిగిందో అది త‌ప్పు అని మ‌న‌సులో చెప్పాల‌నుకున్నా.. స‌రైన మాట‌ల‌తో ఆ మాట‌ల్ని చెప్ప‌లేక‌పోయిన‌ట్లుగా చెప్పారు.

క‌వ‌రింగ్ మాట‌ల్ని ఇంత బాగా చెప్పేస్తున్న పిట్రోడాకు హిందీ రాద‌ని చెప్ప‌టంలో అర్థం లేదు. ఏమైనా.. మాట్లాడే మాట‌లు బాధ్య‌త‌గా ఉండాల‌న్న భావన లేన‌ప్పుడే ఇలాంటివి చోటు చేసుకుంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News