ఆయన మరణంపై బాబు,బాలయ్య తీవ్ర దిగ్బ్రాంతి!

Update: 2016-07-28 07:26 GMT
దక్షిణ భారత దేశ చరిత్రలో కాకతీయుల పాలన ఒక అద్వితీయ ఘట్టం. అయితే అప్పటివరకూ ఉన్న చారిత్రక ఆధారాల్లో సాహిత్య గ్రంథాలతో పాటు శాసన ఆధారాలు ముఖ్యమైనవి. సాహితీ ఆధారాల్లో ఒక వైపు స్పష్టత ఉన్నా శాసన ఆధారాల్లో స్పష్టత మరింత అనివార్యంగా నేడు అందుబాటులోకి వచ్చాయి. ఇలా అందుబాటులోకి రావడానికి కృషి చేసిన వారిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి... పీవీ పరబ్రహ్మ శాస్త్రిగా అందరికీ సుపరిచితులైన డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి. చరిత్రకు సంబంధించిన వందలాది శాసనాలు వెలికితీసిన ఈ మహనీయుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లో కన్నుమూశారు.. ఆయన వయసు 95 ఏళ్లు.

పరబ్రహ్మ శాస్త్రి మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. ఇదే క్రమంలో సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. తన తాజా చిత్రం "గౌతమి పుత్ర శాతకర్ణి" చిత్ర యూనిట్ తరుపున సంతాపం ప్రకటించారు. శాస్త్రి గారి మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటుగా చంద్రబాబు అభివర్ణించారు. ప్రస్తుత కాలంలోని జనాలకు కాకతీయుల పాలనా విశేషాలు తెలిశాయంటే.. అది కేవలం ఆయన కృషే అని బాబు అన్నారు. తన రచనలు పరిశోధనల ద్వారా శాతవాహనులు తెలుగు వారని లోకాని చెప్పిన తెలుగు జాతి ముద్దు బిడ్డ పరబ్రహ్మ శాస్త్రి అని బాలకృష్ణ కొనియాడారు.

పరబ్రహ్మ శాస్త్రి గారి సిద్ధాంత గ్రంథం ది కాకతీయాస్ (కాకతీయులు) ఎప్పటికీ ఒక మాస్టర్ పీస్ అని చరిత్రకారులు చెబుతుంటారు.. ఈ స్థాయిలో తెలుగు సాహిత్యానికి - ఆధునిక చరిత్రకు సేవలందించిన పరబ్రహ్మ శాస్త్రిది గుంటూరు జిల్లా పెద్ద కొండూరు కాగా ఆయన పూర్వీకులు హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు.
Tags:    

Similar News