పవన్ మీటింగ్ లో ఈ కోణం గమనించారా?

Update: 2016-08-26 16:55 GMT
ఆగస్టు 26. ఏమైనా ప్రత్యేకత ఉందా? ఏముంది.. అది ఈ రోజేగా అన్న మాట టక్కున మీ నోటి నుంచి వస్తుంది. ఓకే.. ఇంకేమైనా చెబుతారా? అంటే.. కాస్త ఆలోచించి చాలానే చెప్పొచ్చు. కానీ.. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభను తిరుపతిలో నిర్వహించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ తన బహిరంగ సభ గురించి ఇదే రోజున ప్రకటించటం.

జనసేన పార్టీ పెట్టి ఇన్నిరోజులైనా.. ఆ పార్టీ తరఫున పెద్ద మీటింగ్ పెట్టింది లేదు. పార్టీ ప్రకటన సందర్భంగా పరిమిత ఆహ్వానితుల మధ్య హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీ లో సభను ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు నిర్వహించిన ఈ సభ తర్వాత.. పార్టీ తరఫున బహిరంగ సభ పెట్టింది లేదు. అలాంటిది పవన్ కల్యాణ్ తాజాగా తన బహిరంగ సభ గురించి తన సన్నిహితుల ద్వారా బయటపెట్టటం.. అది కూడా తిరుపతి వేదికగానే కావటం ఒక ఎత్తు అయితే.. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఇదే తిరుపతిలో పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని భారీ సభను నిర్వహించటం ఆసక్తిని రేకెత్తించే అంశం.

నిజానికి ఈ రెండింటికి మధ్య ఎలాంటి సంబంధం లేకపోవచ్చు. రేపటి సభ అజెండా వేరు అయి ఉండొచ్చు. కానీ.. ఏడేళ్ల క్రితం తన అన్న తిరుపతిలో సభ పెట్టాలన్న రోజు పక్క రోజునే తాను అదే ఊర్లో పెద్ద సభను నిర్వహించాలని పవన్ అనుకోవటం విశేషంగానే చెప్పక తప్పదు. నాడు అన్నకు వేదికైన తిరుపతి.. నేడు తమ్ముడికి వేదిక కానుంది. మరీ.. తిరుపతి వేదికగా తమ్ముడు చెప్పే మాట ఏమై ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News