ఇష్టంతో సహజీవనం చేశాక రేప్ ఎంతమాత్రం కాదంతే!

Update: 2019-08-22 04:42 GMT
ఇద్దరు వ్యక్తుల ఇష్టంతో సహజీవనం చేసిన తర్వాత.. అత్యాచారం ఆరోపణలు చేయటం ఏ మాత్రం సరికాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. తాజాగా ఒక జంట సహజీవనం కేసుపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళ ఇష్టంతో సహజీవనం చేసిన తర్వాత.. ఆ వ్యక్తిపై అత్యాచార ఆరోపణలు చేయటం ఏ మాత్రం సరికాదని పేర్కొంటూ.. ఆమె పెట్టుకున్న పిటిషన్ ను కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది.

సేల్స్ ట్యాక్స్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ అయిన ఒక మహిళ.. సీఆర్ఫీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ గా వ్యవహరిస్తున్న వ్యక్తితో ఆరేళ్ల పాటు సహజీవనం చేశారు. వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఇష్టంతో వారి వారి నివాసాల్లో ఆరేళ్లు కలిసి ఉన్నారు. అయితే.. ఆరేళ్ల సంబంధం తర్వాత తన దారిన తాను వెళుతూ.. మరో మహిళను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైన సహజీవన భాగస్వామిపై అత్యాచార ఆరోపణలు చేశారు సదరు మహిళ.

ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఆరేళ్ల సహజీవనం తర్వాత మరో మహిళను పెళ్లాడనున్న వ్యక్తిపై అత్యాచార ఆరోపణలు చేయటం సరికాదని పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానన్న హామీ తర్వాత బలవంతంగా తనతో శారీరక సంబంధం ఏర్పర్చుకొని ఆరేళ్ల సహజీవనం తర్వాత మరొకరిని పెళ్లి చేసుకోవటాన్ని అత్యాచారంగా పరిగణలోకి తీసుకోలేమని సుప్రీం స్పష్టం చేస్తూ.. ఆమె పెట్టుకున్న పిటిషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. 
Tags:    

Similar News