టీడీపీని ఎవరూ పట్టించుకోలేదన్న ఆ పార్టీ ఎంపీ

Update: 2018-04-06 17:16 GMT
టీడీపీ అధినేత చంద్రబాబును దిల్లీలో ఎవరూ పట్టించుకోలేదన్న బాధ ఆ పార్టీ ఎంపీలను పట్టి పీడిస్తోందట.. చంద్రబాబునే కాదు, ఇంతకాలం పార్లమెంటులో నిత్యం కనిపించిన తమను కూడా ఎవరూ పట్టించుకోకపోవడం వారిని మరింత బాధిస్తోందట. దిల్లీలో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని టీడీపీ ఎంపీలే స్వయంగా చెప్పడమే దీనికి ఉదాహరణ..
    
ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడుతుంటే దిల్లీలో ఏ ఒక్కరూ తమను పట్టించుకోవడం లేదని.. తమ మాట చెవిన వినిపించుకోవడం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. లోక్ సభ స్పీకర్ ఛాంబర్ లో టీడీపీ ఎంపీల దీక్షను భగ్నం చేస్తూ, వారిని బలవంతంగా మార్షల్స్ బయటకు తీసుకొచ్చి పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద వదిలేశారు. అనంతరం, మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్పందిచడం లేదని, కనీసం, లోక్ సభ స్పీకర్ కూడా తమ మాట వినడం లేదని, రెండు నిమిషాల సమయం కూడా కేటాయించడం లేదంటూ పాపం చాలా బాధపడ్డారు.
    
స్పీకర్ తమకు సమాధానమివ్వాలంటూ ఆమె ఛాంబర్ లో నిరసన తెలియజేస్తుంటే, మార్షల్స్ వచ్చి తమను బలవంతంగా అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారని అన్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటు సభ్యులు కాదా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 29 రోజుల నుంచి మేము పోరాడుతుంటే ఎవరూ పట్టించుకోవట్లేదంటూ రామ్మోహన్ బాధపడ్డారు.
    
కాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాటలు విన్నవారంతా టీడీపీని బలహీన పర్చడంలో, ఆ పార్టీ నేతల ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీయడంలో బీజేపీ సఫలమైనట్లేనంటున్నారు. ఇదంతా ట్రయలర్ మాత్రమేనని.. ముందుముందు బీజేపీ టీడీపీకి ఏకంగా సినిమా చూపించడం ఖాయమన్న అంచనాలూ వెలువడుతున్నాయి.

Tags:    

Similar News