లోకల్ మీడియా ఏకమైనా... జగన్ ఆపలేకపోయింది

Update: 2019-05-23 10:19 GMT
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీకి బంపర్ మెజారిటీ తీసుకువస్తున్నారు. మొత్తం 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ 150కి పైగా సీట్లలో విజయం నమోదు చేయనుంది. ఈ విజయాన్ని రాష్ట్రస్థాయిలో రికార్డుగానే చెప్పుకున్నా... ఓ విషయంలో మాత్రం జాతీయ స్థాయిలో జగన్ చెరిగిపోని రికార్డును సాధించినట్టుగానే విశ్లేషణలు సాగుతున్నాయి. సాధారణంగా లోకల్ మీడియా వ్యతిరేకించే పార్టీలకు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కినా... బంపర్ మెజారిటీతో విజయం మాత్రం దాదాపుగా దుస్సాధ్యమే.

అయితే ఆ అసాధ్యాన్ని జగన్ సుసాధ్యం చేశారనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో చాలా మీడియా సంస్థలే ఉన్నా... జగన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని సాక్షి మీడియా మాత్రమే వైసీపీకి అండగా ఉంది. ఇక మిగిలిన మీడియా సంస్థలన్నీ కూడా జగన్ పార్టీకి వ్యతిరేకమే. 90 శాతానికి పైగా మీడియా వ్యతిరేకిస్తే... ఏ పార్టీ అయినా గల్లంతు కాక తప్పదు. అయితే జగన్ మాత్రం తనను దిగజార్చేందుకు శక్తివంచన లేకుండా 90 శాతానికి పైగా మీడియా యత్నించినా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగడమే కాకుండా తన పార్టీకి రికార్డు మెజారిటీ సాధించేశారు.

ఈ విషయంలో జగన్ పేరిట నమోదు కానున్న రికార్డును ఇకపై ఏ ఒక్కరు కూడా చెరిపేయడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. లోకల్ మీడియా మొత్తం ఓ వైపు నిలిచి తన గెలుపును అడ్డుకోవాలని యత్నించినా.. జగన్ మాత్రం తనదైన శైలిలో వ్యూహాలు రచించుకుని విజయదుందుభి మోగించారు. జగన్ కు దక్కిన ఈ విజయం ఒక్క టీడీపీ మీద మాత్రమే కాదని, తనను వ్యతిరేకించడంతో పాటుగా తనను తొక్కేయాలని చూసిన 90 శాతం మీడియాపై జగన్ సాధించిన విజయంగానూ సరికొత్త విశ్లేషణలు సాగుతున్నాయి.



Tags:    

Similar News