జగన్ ఏం సెప్పిండు బాస్

Update: 2016-05-02 06:17 GMT
సమయానికి తగ్గట్లుగా మాట్లాడటంలోనే పార్టీ అధినేతల తెలివితేటలు ఎంతలా ఉంటాయన్నది అర్థమవుతుంది. తాజాగా అలాంటి తెలివినే ప్రదర్శించారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మేడే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన జగన్.. శ్రామికవర్గానికి తమ పార్టీలో ఎంత ప్రాధాన్యత ఇస్తామన్న విషయాన్ని చెప్పేందుకు అందరి మనసు దోచుకునేలా ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు. తమ పార్టీ పేరులోనే శ్రామికులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

తమ పార్టీ పేరు అయిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పేరును విడమర్చి చెప్పిన జగన్.. వై అంటే యువజనులు.. ఎస్ అంటే శ్రామికులు.. ఆర్ అంటే రైతులు అని.. ఈ మూడు వర్గాల తరఫున.. వారి సంక్షేమం కోసమే పోరాడే పార్టీనే తమ వైఎస్సార్ కాంగ్రెస్ అని వివరించారు. శ్రామికులకు ఎక్కడ సమస్యలు వచ్చినా వారికి తోడుగా తాము ఉంటామని.. వారికి చేయూతనిస్తామని జగన్ వెల్లడించారు.

శ్రామికవర్గాన్ని పండుగ రోజు అయిన మేడేను పురస్కరించుకొని జగన్ చెప్పిన మాటల్ని విన్నప్పుడు.. సమయానికి తగ్గట్లుగా మాట్లాడటంలో ఆయన నేర్పును అభినందించాల్సిందే. రోటీన్ గా మాటలు చెప్పకుండా.. సమయానికి తగ్గట్లుగా మాట్లాడటానికి మించిన నేర్పు ఇంకేం ఉంటుంది..? ఏమైనా మేడే రోజు జగన్ చెప్పిన మాటలు శ్రామికవర్గాల మనసును దోచుకుంటాయనే చెప్పాలి.
Tags:    

Similar News