ఆ లేఖతో బాబుకు జగన్ చాలా హెల్ప్ చేశారా?

Update: 2016-12-04 07:52 GMT
మిత్రుడ్ని మర్చిపోయినా.. ప్రత్యర్థిని మాత్రం కలలో కూడా మర్చిపోకూడదని చెబుతారు. చుట్టూ ఉండే అనుచర గణం చెప్పే మాటల్ని చెవికెక్కించుకోకున్నా.. ప్రత్యర్థి చెప్పే మాటల్ని.. చేసే వ్యాఖ్యల్ని జాగ్రత్తగా వినాల్సిన అవసరం ముఖ్యనేతలకు చాలా అవసరం. ఆ మాట ఎంత నిజమన్నది తాజాగా  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలపై బాబు కానీ దృష్టి సారిస్తే.. ఆయన పాలనలో ప్రజలు పడుతున్న అసంతృప్తి కొంత మేర తీరుతుందని చెప్పాలి. సామాన్యులకు.. దిగువ మధ్యతరగతి జీవులకు దన్నుగా నిలిచే ఆరోగ్య పథకంపై బాబు సర్కారు శీతకన్ను వేయటాన్ని జగన్ ప్రస్తావించటమే కాదు.. గణాంకాల సాయంతో బాబు సర్కారు ఆరోగ్య శ్రీని ఎంతగా దెబ్బేస్తున్నది చెప్పుకొచ్చారు.

2016-17 సంవత్సరానికి ఆరోగ్య శ్రీ కోసం రూ.910.77 కోట్లు కావాలని సంబంధిత విభాగం ప్రభుత్వం ముందుకు అంచనాలు పెడితే.. కేవం రూ.568.23 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని.. అందులో రూ.395.69 కోట్లు బకాయిలు పోతే.. మిగిలిన మొత్తం చాలా తక్కువని చెప్పుకొచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు పెద్ద ఎత్తున కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చిన పథకాలైన ఆరోగ్యశ్రీ.. 108పథకాల్ని బాబు సర్కారు పెద్దగా పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్న పేరున్న ఇలాంటి పథకాల్ని.. మాతృతకకు మించిన రీతిలోఅమలు చేయాల్సింది పోయి.. అరకొర నిధుల కేటాయింపుతో వేలెత్తి చూపించుకునేలా చేస్తూ బాబు తప్పు చేస్తున్నారని చెబుతున్నారు. మరి.. జగన్ లేఖపై బాబు దృష్టి పెట్టి.. అందులో పేర్కొన్న అంశాలపై దిద్దుబాటు బాట పడతారా? అన్నది ప్రశ్న. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తన లేఖ ద్వారా జగన్ బయటపెట్టిన వివరాలు బాబుకు హెల్ప్ చేస్తాయనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News